
నేడు తెరపైకి రాయల్ సెల్యూట్
రాయల్ సెల్యూట్ చిత్రంలో ప్రదీప్, యువ యువరాజ్, సుభాష్ శింబు
తమిళసినిమా: మొదటి ప్రపంచ యుద్ధం , రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకొని ఇప్పటికీ ఏదో ఒక కారణంగా యుద్ధాలు దేశాల మధ్య జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచ యుద్ధాల లక్ష్యాలు నెరవేరుతున్నయో లేదో కానీ, వాటికి సామాన్య ప్రజలు మాత్రం వాటికి బలవుతూనే ఉన్నారు. అదేవిధంగా వీర సైనికుల ప్రాణ త్యాగాలు చేస్తూనే ఉన్నారు. యుద్ధాలకు ప్రధాన కారణం సరిహద్దుల దురాక్రమణ మాత్రమే కారణం కాదు. అహంకారం, అధికార దాహం వంటి పలు అంశాలు అంతర్గతంగా దాగి ఉంటున్నాయి. అలాంటి అంశాలతో రూపొందిన తాజా చిత్రం రాయల్ సెల్యూట్. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే యుద్ధంలో పాల్గొనే సైనిక దళాల్లో ఏ సైనికుడికి వ్యక్తిగత రాగదేశాలు ఉండవు. వారి ఏకై క లక్ష్యం తమ శత్రుదేశంపై పోరాడి గెలవడమే. అలాంటి యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఇండియా సైనిక దళం మేజర్‌ను ఓ సోల్జర్ రక్షించడానికి పడే తపన, శ్రమ వంటి ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రజలను ఆలోచింపజేసేవిగా ఉంటాయి. అదే విధంగా ప్రాణాపాయంలో ఉన్న ఇండియన్ సైనికుడి పరిస్థితి చూసి పాకిస్తాన్ సైనికుడు ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరచి సాటి మనిషిగా అతని రక్షించడానికి చేసే ప్రయత్నంలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా రూపొందిన రాయల్ సెల్యూట్. ఇందులో చక్కని స్నేహం దానికోసం చేసే త్యాగం వంటి పలు ఆలోచింపచేసే సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. మగిళ్ మూవీ మేకర్స్ పతాకంపై శివ గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి 80 ఏళ్ల దర్శకుడు జై శివ దర్శకత్వం వహించడం విశేషం. ప్రదీప్ ,అర్చన సింగ్ ,యువ యువరాజ్ ,సుభాష్ శింబు, అమరన్ ఎంజీఆర్ ,నటి ఇంబా, జనని తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గణేష్ ముత్తయ్య ఛాయాగ్రహణంను, జై కిసాన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.

నేడు తెరపైకి రాయల్ సెల్యూట్