
ఆ ఇద్దరి చిత్రానికి దర్శకుడెవరు?
తమిళసినిమా: కోలీవుడ్‌లో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న నటులు కమలహాసన్, రజనీకాంత్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరంభ కాలంలో వీరిద్దరూ కలిసి అపూర్వరాగంగళ్, మూండ్రు ముడిచ్చు, 16 వయదినిలే, ఆలావుధీనుమ్ అర్పుద విళక్కు సహా 10 చిత్రాలు చేశారు. అవన్నీ మంచి విజయాన్ని సాధించినవే అన్నది గమనార్హం. కాగా ఆ తరువాత కూడా వీరిద్దరితో చిత్రాలు చేయడానికి పలువురు దర్శక, నిర్మాతలు సిద్ధంగా ఉన్నా, కమలహాసన్, రజనీకాంత్ మాత్రం ఇకపై విడివిడిగా నటించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఇటీవల కమలహాసన్, రజనీకాంత్ హీరోలుగా చిత్రం చేస్తారని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ పేర్కొన్నారు. దీన్ని కమలహాసన్ కూడా ధ్రువపరిచారు. ఇటీవల ఆయన సైమా అవార్డుల వేడుకల్లో తాను తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రజనీతో కలిసి నటించనున్నట్లు చెప్పారు. దీంతో 46 ఏళ్ల తరువాత కమల్, రజనీ కలిసి నటిస్తున్నారన్న వార్త విని వారి అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఇదే విషయాన్ని రజనీ కూడా బుధవారం మరోసారి ధ్రువపరిచారు. ఆయన జైలర్ చిత్ర షూటింగ్ కోసం కేరళకు వెళుతూ చైన్నె విమానాశ్రయంలో కమల్‌తో నటించే చిత్రం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తర్వాత రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న చిత్రంలో నటించనున్నట్టు చెప్పారు. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదన్నారు. కమల్‌తో కలిసి నటించాలన్నది తనకూ ఆశనేనని, అయితే అందుకు తగిన కథ, కథా పాత్రలు అమరాలని, అలా అమిరితే కచ్చితంగా నటిస్తానని రజనీకాంత్ అన్నారు. దీంతో ఈ చిత్రానికి దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించే అవకాశం లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడేవరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పకతప్పదు.