
అభ్యుదయ కవిత్వానికి తొలి వెలుగు ఆరుద్ర
అన్నానగర్: సాహిత్యాన్ని, శాస్త్రాన్ని సమాజానికి ఎలా అన్వయించాలన్నది ఆరుద్ర తన రచనల ద్వారా సూచించారని ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు పేర్కొన్నారు. రాజధాని కళాశాల తెలుగు విభాగంలో ధర్మనిధి ప్రసంగాలలో భాగంగా బుధవారం ఉదయం సభ ఏర్పాటైంది. ఎస్వీ యూనివర్శీటీ తెలుగు శాఖ విశ్రాంత అధ్యక్షులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు ఈ సభలో ముఖ్య వక్తగా అభ్యుదయ సాహిత్యంలో ఆరుద్ర అనే అంశం మీద ప్రసంగించారు. ఆరంభం నుంచి అవసానం వరకు ఆరుద్ర అభ్యుదయ కవియే అని, మార్కిస్ట్ కళ్ళల్లోంచి సమాజాన్ని ఆయన చూసారని తెలిపారు. ఆరుద్ర కవన నడకను శ్రీశ్రీ నుంచీ, మార్కిజంను చాగంటి సోమయాజులు నుంచీ, ఆంగ్ల సాహిత్య అవగాహనను రోణంకి అప్పలస్వామి నాయుడు నుంచీ స్పూర్తిని పొందారని చెప్పారు. దోపిడీకి, వివక్షకు గురై ఉన్న వారిపట్ల కవి ఉండాలని అన్నారు. ఆరుద్ర రచనల్లో త్వమేవాహం, సినీవాలి రచనల గురించి ప్రస్తావించారు. శాసీ్త్రయ సాంకేతికతను తెలుగుసాహిత్యానికి అన్వయించడంలో గొప్ప రచనలు చేశారని కొనియాడారు. రాజధాని కళాశాల పూర్వ విద్యార్థులైన మేడిపల్లి రవికుమార్ గారు తాను చదువుకున్న కళాశాలలో, తమ గురువు ఎల్. బి.శంకర రావు గారి సమక్షంలో ప్రసంగించడం, సన్మానం పొందడం గొప్ప భాగ్యంగా , సంతోషంగా ఉందన్నారు. సభకు కళాశాల ఆచార్యులు డాక్టర్ మురళి ప్రారంభ ఉపన్యాసం చేయగా తెలుగుశాఖ అధ్యక్షులు డాక్టర్ ఎలిజబెత్ జయకుమారి గారు సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు ఎల్.బి శంకరరావు గారు, రచయితి శ్రీమతి సుజాత, రచయిత ఆచార్య కాసల నాగభూషణం ,మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యపకులు డాక్టర్.కాళియప్ప, డాక్టర్.శంకర బాబు, డాక్టర్ అముక్తమాల్యద, నిర్మలా పళనివేలు, విద్యార్థులు పాల్గొన్నారు. యం.ఎ విద్యార్థిని ప్రేమావతి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.