
‘దేవర్’కు భారతరత్న ఇవ్వండి
సాక్షి, చైన్నె : దక్షిణ తమిళనాడులో అత్యంత ప్రసిద్ధుడైన పసుం పొన్ ముత్తురామ లింగ దేవర్‌కు భారత రత్నం ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి విన్నవించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ ముగ్గురు కీలక నేతలకు మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అమిత్ షా వద్ద పళణి తేల్చి చెప్పినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో అత్యధిక జనాభా కల్గిన ముక్కుళత్తూరు సామాజిక వర్గ ప్రజల ఆరాధ్యుడే కాదు.. ఆథ్యాత్మిక రాజకీయ వేత్తగా పసుం పొన్ ముత్తు రామలింగ దేవర్ అందరికీ సుపరిచితులే. అక్టోబరు నెలాఖరులో గురుపూజోత్సవం దక్షిణాది జిల్లాలో మిన్నంటుంది. రామనాథపురంలోని కౌముదిలో దేవర్ స్మారకం వద్దకు లక్షలలో ఆ సామాజిక వర్గం తరలి రావడం ఆనవాయితీ. ఈ పరిస్థితులలో ఆ సామాజిక వర్గం ఓట్లను గురి పెట్టే దిశగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహ రచనలో పడ్డారు. మహోన్నత వ్యక్తి దేవర్‌కు భారత రత్నను కేంద్రం ద్వారా ఇప్పించుకోగలగిన పక్షంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వ్యూహాలకు పదును పెట్టినట్టున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ చిన్నమ్మ శశికళ, మాజీ సీఎం పన్నీరు సెల్వంలు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో వారికి చెక్ పెట్టే వ్యూహంతో పళణి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా ఢిల్లీ పర్యటన సాగడం గమనార్హం.
అమిత్‌షాకు వినతి
మంగళవారం రాత్రి అమిత్ షాతో గంటన్నరకు పైగా పళణి స్వామితోపాటుగా అన్నాడీఎంకే నేతలు భేటీ అయ్యారు. అమిత్ షాను కలిసి వారిలో అన్నాడీఎంకే ఎంపీలు తంబిదురై, ఇన్బదురై, సీవీ షణ్ముగం, ఎం. ధనపాల్ , సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి , దిండుగల్ శ్రీనివాసన్, కేపీ మునుస్వామిలు ఉన్నారు. ఈసందర్భంగా దేవర్ గురించి వివరిస్తూ ఆయనకు భారత రత్నం ఇవ్వాలని అమిత్ షా ముందు విజ్ఞప్తిని ఉంచడం గమనార్హం. ఈ భేటీ తదుపరి 20 నిమిషాలు పళణి స్వామితో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ భేటీలో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ వారు, బయటకు వెళ్లిన వారిని అక్కున చేర్చుకునే విధంగా అమిత్ షా సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బయటకు వెళ్లిన వారందర్నీ ఆహ్వానించేందుకు సిద్ధమని, అయితే, బహిష్కరించ బడ్డ ఆ ముగ్గురు(శశికళ, దినకరన్, పన్నీరు)లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని పళణి స్పష్టం చేసి బయటకు రావడమే కాకుండా దేవర్‌కు భారత రత్న ప్రకటిస్తే, ఆ సామాజిక వర్గం అంతా తన వెన్నంటే ఉంటుందన్న సూచన చేసి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ముఖానికి కర్చీఫ్‌పై చర్చ
అమిత్ షాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన పళణి స్వామి ముఖానికి కర్చీఫ్ కప్పుకుని కారులో వెళ్లడం చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో దృశ్యాలు బుధవారం వైరల్‌గా మారాయి. ముఖాన్ని దాచుకోవాల్సినంత పరిస్థితి పళణికి ఎందుకు వచ్చిందో అన్న వ్యంగ్యాస్త్రాలు సామాజిక మాధ్యమాలలో హోరెత్తుతున్నాయి. ఈ విషయంగా మంత్రి రఘుపతి మాట్లాడుతూ, లోపల ఏమి జరిగిందో ఏమో బయట ముఖం చూపించ లేని పరిస్థితులో కర్చీఫ్ వెనుకు దాచుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంనేత టీటీవీ దినకరన్ స్పందిస్తూ, ఇక, పళని స్వామికి కొత్త పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. మాస్క్ పళణి స్వామి అంటూ ఎద్దేవా చేశారు. పన్నీరు మద్దతు నేత పుగలేంది పేర్కొంటూ, నేరగాళ్లు బయటకు ముఖాన్ని చూపించ లేక దాచుకోవడం చూశామని, అయితే ప్రస్తుతం ఓ నాయకుడు ఇలా వ్యవహరించడం వెనుక ఏదో జరిగే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ, ఢిల్లీలో సాగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలో మద్దతు దారులను ఏకంచేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.