
అక్టోబర్ 18న వేలూరుకు విజయ్
వేలూరు: టీవీకే రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ అక్టోబర్ 18వ తేదీన వేలూరు రానున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అనుమతి కోసం వేలూరు ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మంగళవారం ఉదయం ఆ పార్టీ తూర్పు డివిజన్ కార్యదర్శి నవీన్‌కుమార్, పడమర డివిజన్ కార్యదర్శి వేల్‌మురుగన్‌ల ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అఽధిక సంఖ్యలో వెళ్లి ఎస్పీ మయిల్‌వాగనం వద్ద వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే నెల 18వ తమ పార్టీ అధ్యక్షుడు విజయ్ వేలూరు జిల్లాకు చేరుకుని పార్టీ కార్యకర్తలతో మాట్లాడనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సమావేశం జరగనుందన్నారు. వేలూరు అన్నారోడ్డులో ఉన్న అన్నాకలైఅరంగం, అనకట్టు బస్టాండ్, గుడియాత్తం పాత బస్టాండ్, కేవీ కుప్పం బస్టాండ్, కాట్పాడిలోని చిత్తూరు బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఇందుకోసం అనుమతి కోరడంతో పాటు పోలీస్ బందోబస్తు కల్పించాలని ప్రస్తుతం వినతి పత్రం అందజేశామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు కరుణ, సారంగన్, వెంకట్, లోకేష్, ప్రకాష్, అరవింద్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.