
కోలీవుడ్‌లోనూ మిరాయ్‌కు ప్రశంసలు
తమిళసినిమా: ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిత్రం మిరాయ్. హనుమాన్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత యువ నటుడు తేజాసజ్జా కథానాయకుడిగా నటించిన సోషియో మైథిలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రం ఇది. మంచుమనోజ్ ప్రతినాయకుడిగా నటించిన ఇందులో రితికానాయక్ నాయకిగా నటించగా శ్రియ, జయరామ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పీపుల్స్ మీడియా పతాకంపై విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ లో నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తమిళంలో ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేసింది. చిత్రాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరు వినూత్నంగా ఉండడం, ముఖ్యంగా చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. సంగీతం, చాయాగ్రహణం నైపుణ్యం చిత్రానికి అదనపు బలంగా నిలిచాయి. దీంతో చిత్రం భారీ విజయం వైపు దూసుకుపోతోందంటున్నారు విశ్లేషకులు. మిరాయ్ చిత్రంలో గ్రాఫిక్స్, సీజీఐ సన్నివేశాలు తమిళ ఇండస్ట్రీని విస్మయం పరుస్తోంది. సాధారణంగా ఇతర భాషా చిత్రాలు కోలీవుడ్‌లో తక్కువగా ప్రశంసలు పొందుతాయి. అలాంటి వాటిలో మిరాయ్ ఒకటిగా నిలవడం విశేషం.