
రుణాలను సద్వినియోగం చేసుకోండి
వేలూరు: స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని వాటి ద్వారా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని సేలం జిల్లాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. దీంతో వేలూరు జిల్లాలోని 508 స్వయం సహాయక సంఘాలకు రుణ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలోని 508 సంఘాల్లోని 56 వేల మంది సభ్యులకు రూ.57.90 కోట్ల విలువ చేసే బ్యాంకు రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా సంఘాల్లోని సభ్యులు చిన్నచిన్న పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా ఆదాయం పొంది ప్రతినెలా బ్యాంకులకు చెల్లించేందుకు ఆశక్తి చూపడంతో పాటు వీటి ద్వారా కుటుంబం కూడా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సభ్యులు కూడా అధికంగా సభ్యులుగా చేరారన్నారు. మీ ప్రాంతంలోని వారిని కూడా సంఘాల్లో చేరేందుకు అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే కార్తికేయన్ మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలోనే మహిళా సంఘాలను ప్రారంభించారన్నారు. ప్రస్తుతం మహిళా సంఘాల అభివృద్ధి కోసం బ్యాంకు రుణాలను అందజేస్తున్నామని చెప్పారు. మహిళాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రతిరోజూ కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వాటిని ప్రజలకే నేరుగా చేరే విధంగా చూస్తున్నారని చెప్పారు. అర్హులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.