
మహిళల మద్దతుతో మళ్లీ అధికారం
ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ధీమా
మహిళా సంఘాలకు గుర్తింపు కార్డులు
బస్సులలో 100 కి.మీ వరకు ఉచిత సేవ
సేలం: వివిధ వర్ణాలతో కూడిన ప్రచార రథాలెక్కి ఎంత మంది బయలు దేరినా, మహిళల మద్దతుతో డీఎంకే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. పర్యాటక మంత్రి ఆర్. రాజేంద్రన్ నేతృత్వంలో సేలం లోని కరుప్పూర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మంగళవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఈ వేడుకలో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల బృందాలకు రూ. 3,500 కోట్ల విలువైన బ్యాంకు రుణ పంపిణికి చర్యలు తీసుకున్నారు. ఒకే సమయంలో అన్ని చోట్ల రుణాల పంపిణీ సాగింది. బృందాలకు చెక్కులను అందజేశారు. అలాగే, సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈసందర్భంగా మహిళా బృందాల నేతృత్వంలో మూలికలతో కూడిన సౌందర్య సాధనాలు, చెప్పులు, చేనేత చీరలు, జనపనార సంచులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ఆరగించి ఉత్సాహంగా హెర్బల్ టీ తాగారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు అంతటా రూ. 3,500 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను ఒకే రోజున అందజేశామని, అలాగే, ఒక లక్ష గుర్తింపు కార్డులను అందించడం ఎంతో సంతోషంగాఉ ందన్నారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమమా లేదా మహిళా మహానాడా అన్నట్టుగా ఉందన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల బృందాలు,రుణాల పంపిణిని 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ధర్మపురిలో ప్రారంభించారని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఆబృందాల సంఖ్య 5 లక్షలకు చేరిందని వివరించారు.
గుర్తింపు కార్డుతో ఉచిత ప్రయాణం..
తొలిసారిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు గుర్తింపు కార్డులు రాష్ట్రంలో జారీ చేశారు. ఈ గుర్తింపు కార్డు ఆధారంగా మహిళ సంఘాలు తమ ఉత్పత్తులను ప్రభుత్వ బస్సుల్లో 100 కిలోమీటర్ల వరకు ఉచితంగా రవాణా చే సుకునే అవకాశం కల్పించినట్టు ఈ సందర్భంగా ఉదయ నిధి ప్రకటించారు. మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ముఖ్యమంత్రి స్టాలిన్ మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ తొలి సంతకం చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 1.15 కోట్ల మంది మహిళలకు మహిళాకు నెలకు రూ. 1000 పంపిణీ జరుగుతోందని, త్వరలో ఈ సంఖ్య పెరుగుతుందన్నారు.
ఏ బస్సుల్లో వచ్చినా సరే
ఎవరికి వారు వారికి తోచి న రంగుల బస్సులలో రాష్ట్రవ్యాప్తంగా చక్కర్లు కొట్టినా, ఆకుపచ్చ, గులాబీ బస్సులు ఉరకలు తీసినా, మహిళా మద్దతుతో డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్. రాజేంద్రన్, లోక్‌సభ సభ్యులు టి.ఎం. సెల్వగణపతి, ప్రకాష్, మేయర్ ఎ. రామచంద్రన్, ఎమ్మెల్యేలు అరుళ్, సదాశివం, కలెక్టర్ ఆర్. బృందాదేవి పాల్గొన్నారు.