
మైలాడుతురైలో పరువు హత్య..!
సాక్షి,చైన్నె : మైలాడుతురైలో పరువు హత్య జరిగింది. తమ కుమార్తెను ప్రేమించడమే కాకుండా రహస్యంగా పెళ్లికి సిద్ధమయ్యాడన్న సమాచారంతో ఓ కుటుంబం ఘాతుకానికి పాల్పడింది. ప్రియురాలి తల్లిదండ్రులే ఈ హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో మంగళవారం వెలుగు చూసింది. వివరాలు. మైలాడుతురై సమీపంలోని అడియక్క మంగళంకు చెందిన కుమార్ తనయుడు వైర ముత్తు(28) ఐటీఐ చదువుతూ ద్విచక్ర వాహన మెకానిక్‌గా కూడా పనిచేసేవాడు. అదేప్రాంతానికి చెందిన గ్రాడ్యుయేట్ యువతి(26)తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ యువతి చైన్నెలోని ఓ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరిది ఒకే కులమైనప్పటికీ, వీరి ప్రేమ వ్యవహారానికి పెద్దల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ముత్తు మెకానిక్ కావడంతో ఆ యువతి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. అతడితో పరిచయం మానుకోవాలని పదేపదే హెచ్చరించారు. ఇరు కుటుంబాల మధ్య ఈ ప్రేమ వ్యవహారంపై తరచూ గొడవ తప్పలేదు. ఈనెల 12వ తేదీన ఆ యువతి వైర ముత్తు వద్దకువెళ్లినట్టు సమాచారం. చివరకు వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరడంతో పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టారు. కొన్ని నెలలలో పెళ్లి చేస్తామని హామీ ఇచ్చి బయటకు వచ్చిన ఆ యువతి తల్లిదండ్రులు వైరముత్తును హతమార్చేందుకు వ్యూహం పన్నారు. ఎలాగో పెళ్లి కాబోతోంది కదా? అని ఆ యువతి సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుంచి చైన్నెకు బయలు దేరింది. ఆమెను బస్సు ఎక్కించి తిరుగు పయనంలో ఉన్న వైర ముత్తుపై మంగళవారం వేకువ జామున దాడి జరిగింది. ద్విచక్ర వాహనంలో వస్తున్నఅతడ్ని గ్రామ శివారులో కత్తులతో ఓ ముఠా దాడి చేసింది. వారి నుంచి తప్పించుకుని గ్రామంలోకి ఉరకలు తీశాడు. అయితే, ఆ ముఠా వెంటాడి వేటాడి మరీ హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వైర ముత్తు కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ యువతి తల్లిదండ్రులు పత్తా లేకుండా పోవడంతో ఈ హత్యను వారే చేయించి ఉంటారన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.