
వేటైకారన్‌లను ఎస్టీ జాబితాలో చేర్చాలి
తిరువళ్లూరు: వేటైకారన్ తెగకు చెందిన ప్రజలను మళ్లీ ఎస్టీ జాబిలో చేర్చాలని మహానాడులో తీర్మానం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. తమిళనాడు వేటైకారన్ గిరిజన పీపుల్స్ ప్రోగ్రెస్ అసోసియేషన్ మూడో రాష్ట్ర మహానాడు తిరువళ్లూరులోని ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేటైకారన్ తెగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సేట్టు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే ఢిల్లీబాబు హాజరై, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువణ్ణామలై, వేలూరు, కాంచీపురం, విల్లుపురం, తిరువళ్లూరు తదితర జిల్లాల్లోని వేటైకారన్ తెగకు చెందిన ప్రజలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై డీఎంకే ఎన్నికల్లోనూ హమీ ఇచ్చిందని, ప్రస్తుతం హమీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 1961 వరకు తమిళనాడులో వేటైకారన్ తెగకు చెందిన వారిని ఎస్టీ జాబితాలో ఉంచి, తొలగించారు. ప్రస్తుతం పుదుచ్చేరి, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ఎస్టీ జాబితాలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ మహనాడులో సంఘం రాష్ట్ర అద్యక్షుడిగా లక్ష్మణన్, రాష్ట్ర కార్యదర్శి గంగాదురై, కోశాధికారిగా సేట్టు తదితరులను ఎన్నుకున్నారు. మహనాడులో సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాల్, కొండ జాతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమిళరసు, వ్యవసాయ సంఘం జిల్లా కన్వీనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.