
ఏకతాటిపైకి తమిళనాడు నినాదం
తిరుత్తణి: బీజేపీ ప్రభుత్వ తమిళ వ్యతిరేక విధానంతోపాటు రాష్ట్రాలపై చిన్నచూపు, ఓటర్లు పట్టికలో అవకతవకలకు నిరసనగా ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో సీఎం స్టాలిన్ జూలై 1న ఉద్యమం ప్రారంభించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు గడప గడపకు వెళ్లి కుటుంబీకులను కలుసుకుని బీజేపీ ప్రభుత్వ తమిళ వ్యతిరేక విధానాలు, నిధుల కోతకు సంబంధించి వివరించారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు డీఎంకే వైపు మొగ్గు చూపారు. 90 రోజుల్లో కోటి మంది ఒకే జట్టుగా తమిళనాడు ఉద్యమం ద్వారా డీఎంకేలో చేరినట్లు పార్టీ ప్రకటించింది. తిరువళ్లూరు, తిరుత్తణి నియోజకవర్గాల్లో పార్టీలో చేరిన సభ్యులకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే చంద్రన్ సోమవారం విడుదల చేశారు. తిరుత్తణి నియోజకవర్గంలో 1.27 లక్షల మంది చేరగా, తిరువళ్లూరు నియోజకవర్గంలో 1.17 లక్షల మంది సభ్యత్వం స్వీకరించినట్లు తెలిపారు. ఇక ఒకే జట్టు ఉద్యమంతో రెండో విడత అన్నా జయంతి సందర్భంగా ప్రారంభించినట్లు, సభ్యులంతా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు.