
అన్బు గుప్పెట్లోకి పీఎంకే?
సాక్షి, చైన్నె: పీఎంకే రాజకీయ వివాదంలో కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) కొత్త ట్విస్టు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా న్యాయవాది బాలు వ్యాఖ్యల తూటాలను పేల్చుతూ ఆధారాలు చూపించారు. పీఎంకేకు అధ్యక్షుడు అన్బుమణి అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని ఆయన మద్దతు న్యాయవాది బాలు ప్రకటించారు. పార్టీ చిహ్నం కూడా అన్బుమణికే అప్పగించినట్టు పేర్కొన్నారు. పార్టీకి వ్యవస్థాపకుడిగా రాందాసు వ్యవహరిస్తారని వివరించారు. వివరాలు.. పీఎంకేలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య జరుగుతూ వస్తున్న అధికార వార్ గురించి తెలిసిందే. పార్టీకి తానే అధ్యక్షుడినని అన్బుమణి, కాదు.. కాదు పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిని తానేనని రాందాసు ప్రకటించుకుంటూ వస్తున్నారు. నాయకులు, కేడర్ రెండుగా విడిపోయి అన్బుమణి, రాందాసు అంటూ వేర్వేరుగా రాజకీయాలు సాగిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్బుమణిని పార్టీ నుంచి తప్పించిన రాందాసు, ఆయన స్థానాన్ని తన కుమార్తె శ్రీగాంధి ద్వారా భర్తీచేసే విధంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఆమెకు పార్టీ కార్యక్రమాలలో ప్రాధాన్యతను పెంచారు. ఈ పరిస్థితులలో సోమవారం టీ నగర్‌లో అన్బుమణి మద్దతు న్యాయవాది బాలు మీడియా ముందుకు వచ్చారు.
అధ్యక్షుడిగా అన్బుమణి..
అన్బుమణి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం మేరకు తాము ఎన్నికల కమిషన్‌కు పంపిన వివరాలన్నీ ఆమోదం పొందినట్లు బాలు ప్రకటించారు. పార్టీకి అధ్యక్షుడిగా అన్బుమణి వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. పార్టీ చిహ్నం, జెండా కూడా ఆయనకే అప్పగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి తమకు తాజాగా లేఖ అందినట్టు వివరించారు. ఈ లేఖ మేరకు ఈనెల 9వ తేదీన అన్బుమణిని అధ్యక్షుడిగా ఆమోదించినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం పంపబడ్డట్టు పేర్కొన్నారు. పార్టీకి వ్యవస్థాపకుడిగా రాందాసు కొనసాగుతారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఆగస్టు 2026 వరకు పార్టీ పదవులలో ఉన్న వారు కొనసాగే రీతిలో పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సైతం ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసిందని ప్రకటించారు. అయితే ఈ పరిణామాలపై రాందాసు నుంచి ఎలాంటి స్పందన తాజాగా రాలేదు. వీరి తరఫున సైతం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సర్వసభ్య సమావేశ తీర్మానాలు వెళ్లి ఉన్న దృష్ట్యా, కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి దానికి ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచిచూసే ధోరణిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే బాలు తప్పుడు సమాచారంతో పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారని రాందాసు మద్దతు నేత అరుల్ వ్యతిరేకించారు.
రాందాసు, అన్బుమణి