
వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెట్టండి
కొరుక్కుపేట: వినూత్న ఆవిష్కరణపై విద్యార్థులు దృష్టిపెట్టాలని ఐఐటీ మద్రాసు అతిథి అధ్యాపకులు, లెట్స్‌ప్లే టూ లెర్న్ వ్యవస్థాపకులు కార్తీక్ వడియానాథన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇంజినీరింగ్ డే వేడుకల్లో భాగంగా సొసైటీ ఫర్ యంగ్ నెట్ వర్కింగ్ కోడర్స్(ఎస్‌వైఎన్‌సీ క్లబ్) సహకారంతో ఎస్‌ఆర్‌ఎం వడపళని క్యాంపస్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం తరఫున ది ఎడ్యుకేషనల్ లీడర్ షిప్ సమ్మిట్ 2025ను సోమవారం ఘనంగా నిర్వహించారు. తరగతి గదిలో ఏఐ – విప్లవమా, ప్రమాదమా అనే అంశంపై చర్చ కార్యక్రమం జరిగింది, ఇది విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలు, సవాళ్లు రెండింటినీ అర్థం చేసుకోవడం, ప్రాముఖ్యతను విశ్లేషించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు, డీన్ (ఎఫ్‌ఈటీ) డాక్టర్ సి.వి.జయకుమార్, వైస్ ప్రిన్సిపల్ (విద్యా–నియామకాలు) డాక్టర్ సి. గోమతి ప్రత్యేక ప్రసంగంతో విద్యార్థుల్లో ఏఐపై అవగాహన పెంచారు. సీఎస్‌ఈ విభాగాధిపతి డాక్టర్ గోల్డా దిలీప్ స్వాగతోపన్యాసంలో సదస్సు లక్ష్యాలను వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్తీక్ మాట్లాడుతూ.. యువత వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని, తన స్వంత అనుభవం ద్వారా కృత్రిమ మేధస్సును ఉపయోగించడంతో కలిగే ముఖ్య ప్రయోజనాలు, సవాళ్లను తెలియజేశారు.