
మహిళ ఆత్మహత్య
తిరువళ్లూరు: ఇంటి సమీపంలో అనుమానాస్పద వ్యక్తులు రావడాన్ని ప్రశ్నించిన మహిళను అసభ్యకరమైన మాటలతో దూషించడంతో మనస్తాపం చెందిన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువుల మప్పేడు పోలీసుస్టేషన్‌ను ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ మప్పేడు పన్నూరు గ్రామానికి చెందిన ఫెలిక్స్‌రాజ్ భార్య జ్యోతిశాంతి. వీరు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి పన్నూరులో నివాసం ఉంటున్నారు. జ్యోతిశాంతి ఇంటికి సమీపంలో ఫాతిమా నివాసం ఉంటున్నారు. ఫాతిమా ఇంటికి తరచూ గుర్తు తెలియని యువతీయువకులు రావడంతో అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఫాతిమా ఇంటికి వచ్చే యువతీయువకులు జ్యోతిశాంతి ఇంటి ముందు వాహనాలను పార్కింగ్ చేయడంతో వివాదం చెలరేగింది. తమ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారని, తరచూ గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికి సమీపంలో రావడం ద్వారా అభద్రతా భావంతో ఉన్నట్టు ఫాతిమాతో జ్యోతిశాంతి గొడవలకు దిగింది. చిన్నగా ప్రారంభమైన ఘర్షణ పెద్దగా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫాతిమా బంధువులు జ్యోతి వద్దకు వెళ్లి తమ ఇంటికి ఎవరొచ్చినా మీకెందుకు ఇబ్బంది అంటూ నానాదుర్భాషలాషడారు. అసభ్యకరమైన పదజాలంతో దూషించడంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతిశాంతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ విషయంపై బాధితులు ఫిర్యాదు చేసినా మప్పేడు పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బంధువులు మప్పేడు పోలీసుస్టేషన్‌ను ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.