చరిత్ర సృష్టించాలి..! | - | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించాలి..!

Sep 16 2025 7:27 AM | Updated on Sep 16 2025 7:27 AM

చరిత్

చరిత్ర సృష్టించాలి..!

● అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధం ●విద్యార్థులకు సీఎం స్టాలిన్‌ సూచన ●అమల్లోకి.. అన్భుకరంగల్‌ పథకం

విజయంతో

అన్బుకరంగల్‌ పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్‌

ప్రతి విద్యార్థి భవిష్యత్తులో విజయం సాధించి తమిళనాడులో చరిత్ర సృష్టించాలని సీఎం ఎంకే స్టాలిన్‌ పిలుపు నిచ్చారు. ఇందుకోసం ఎల్లప్పుడు ఓ స్నేహితుడిగా, తల్లిదండ్రుల తరహాలో ప్రతి ఒక్కరికీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఇక్కడే ఉన్నాను....ఇక్కడే ఉంటాను...విజయాలను లఖిద్దాం అంటూ పిలుపునిచ్చారు.

సాక్షి, చైన్నె : సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ నేతృత్వంలో సోమవారం కలైవానర్‌ అరంగం వేదికగా బ్రహ్మాండ కార్యక్రమంగా అన్భుకరంగల్‌ పథకం ఆవిష్కరణ జరిగింది. వివిధ కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మరొకరి సంరక్షణ పొందలేని పిల్లలను అక్కున చేర్చుకునే విధంగా ఈపథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 18 సంవత్సరాలలోపు ఉన్న ఈ పిల్లల మధ్యలో తమ చదువులు ఆపేయకుండా, కొనసాగించే విధంగా యుక్త వయస్సు వచ్చే వరకు నెలకు రూ. 2 వేలు స్కాలర్‌ షిప్‌ పంపిణీకి చర్యలు తీసుకున్నారు. తాయుమనవర్‌ పథకంకు అనుసంధానంగా అన్భుకరంగల్‌ (ఆపన్న హస్తం – హ్యాండ్స్‌ ఆఫ్‌ లవ్‌) పేరిట ఈ తాజా పథకం అమల్లోకి తీసుకొస్తూ సీఎం స్టాలిన్‌ చర్యలు తీసుకున్నారు. ఈ పథకానికి ఎంపికై న పిల్లలకు సీఎం స్టాలిన్‌ స్కాలర్‌ షిప్‌లను పంపిణీ చేశారు. తమిళనాడు ఈ–గవర్నెన్స్‌ కోసం మొబైల్‌ యాప్‌కు వివిధ విభాగాలు, సంస్థల నుంచి అందిన వివరాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం, మీతో స్టాలిన్‌ క్యాంప్‌, జిల్లా కలెక్టర్‌ , జిల్లా బాలల సంక్షేమం అధికారి నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తదుపరి ఈ పథకం కోసం 6,082 మందిని ఎంపిక చేశారు. ఈ పిల్లలకు ప్రతినెలా తమిళనాడు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించే విధంగా తాజాగా స్కాలర్‌ షిప్‌లను ప్రకటించారు. అలాగే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన తదుపరి 12వ తరగతి పూర్తి చేసి 1,340 మంది విద్యార్థులు వివిధ ఉన్నత విద్యా సంస్థలలో సీట్లను దక్కించుకున్నారు. వీరికి ల్యాప్‌టాప్‌లను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా హక్కుల శాఖ విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనల కొలువును సీఎం సందర్శించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, మంత్రులు కె.ఎన్‌. నెహ్రూ, పి. గీతా జీవన్‌,ఎం. సుబ్రమణ్యం, పి.కె. శేఖర్‌ బాబు, మేయర్‌ ప్రియ, ఎమ్మెల్యేలు పరంధామన్‌, తాయకం కవి, డిప్యూటీ మేయర్‌ ఎం. మహేష్‌ కుమార్‌,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌. మురుగానందం, మహిళా హక్కుల శాఖ ప్రభుత్వ కార్యదర్శి, జయశ్రీ మురళీధరన్‌, బాలల సంక్షేమం , ప్రత్యేక సేవల విభాగం డైరెక్టర్‌ శిల్ప ప్రభాకర్‌ సతీష్‌, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎం.ఎస్‌. సంగీత, తమిళనాడు మోడల్‌ స్కూల్స్‌ సభ్య కార్యదర్శి ఐ.ఆర్‌. సుదన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆ ముగ్గురు నేర్పిన విద్య..

ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ప్రసంగిస్తూ, అన్నాదురై జయంతి సందర్భంగా ఈ పథకం అమల్లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. పేదవాడి నవ్వులో దేవుడిని చూశాం.. అన్నది ద్రావిడ సిద్ధాంతం అని పేర్కొంటూ, ఇక్కడున్న పిల్లల ముఖాలలో చిరునవ్వు ఆనందం అందరికీ అన్ని నినాదానికి బలాన్ని చేకూర్చిందని వ్యాఖ్యలు చేశారు. అందరికీ అన్ని అన్నది అంత సులభం కాదని పేర్కొంటూ, ఇందుకు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తమిళ ప్రజలు, తమిళ సమాజ అవసరాలు తీర్చడమే పెరియార్‌ ,అన్నా, కలైంజ్ఞర్‌ కరుణానిధి తమకు నేర్పిన రాజకీయ విద్య అని వివరించారు. ఎల్లప్పుడూ ప్రజలతో ఉండటం, సగటు వ్యక్తికి ఏం అవసరం గుర్తించడం, దానిని పరిష్కరించే విధంగా ముందుకెళ్లడమే లక్ష్యంగా పేర్కొన్నారు. చాలా మంది రాజకీయాలు అంటే ఏంటో అని అనుకుంటారని పేర్కొంటూ అధికారంలోకి వచ్చినానంతరం పదవీ వ్యామోహంలో మునిగి పోకుండా, ఆకర్షణీయ పథకాలను ప్రణాళికలను రూపొందించడం, మళ్లీ ఎన్నికలు వెళ్లడం అని అనుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే, తనది పదవీ కాదు, బాధ్యత, పునాది అధికారం అంటే సామాన్యుడి కోసం పోరాడటమే అని చెప్పారు. తాయుమనవర్‌ ప్రాజెక్టులో భాగంగా తాజాగా అన్బుకరంగల్‌ అమల్లోకి తీసుకొచ్చామని వివరిస్తూ, ప్రతి నెల పథకం ద్వారా 6,082 మంది పిల్లలకు రూ. 2,000 అందజేయబడుతుందని ప్రకటించారు.

సంక్షోభ సమయంలో అధికారంలోకి..

ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం ఎలాంటి సంక్షోభ పరిస్థితులలో అధికార పగ్గాలు చేపట్టిందో అందరికీ బాగా తెలుసునని కరోనా కాలంలో ఎదురైన ఘటనలను గుర్తు చేశారు. కరోనా కాలంలో తల్లిదండ్రులను కోల్పోయిన 15,775 మంది పిల్లలకు తాము రూ. 511 కోట్లను చేయూతగా అందించామన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నెలక రూ. 3 వేలు అందజేస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ సేవా గృహాలు, సంక్షేమ హాస్టళ్లలోని 1400 మంది బాలికలకు ఆత్మరక్షణతో పాటుగా క్రీడా శిక్షణ అందించామని వివరించారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వస్తున్నామని వివరిస్తూ, వీటికి రాజకీయాలకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న నమ్మకం నుంచి ఉద్భవించిన బాధ్యత ఇది అని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎంపికై న పిల్లలకు పాఠశాల విద్య పూర్తి అయ్యే వరకు స్కాలర్‌ షిప్‌లు, ఆతదుపరి గ్రాడ్యుయేషన్‌ , కళాశాల విద్య , వివిధ నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందించి భవిష్యత్తులో వారిని సొంత కాళ్ల మీద నిలబెట్టే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. చదువు మధ్యలో ఆగి పోరాదని, మరింత ముందుకు సాగాలని అదే తన కోరిక అని పేర్కొన్నారు. ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం నిరంతరం విద్యార్థులకు ఆపన్నహస్తం అందిస్తుందన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో చదువుకుని డాక్టర్‌ అవుతారో, ఇంజనీర్‌ అవుతారో, శాస్త్రవేత్తగా లేదా ఐఏఎస్‌, ఐపీఎస్‌ లేదా ఓ ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలలో అధికారిగా ...ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుడిగా ఎదిగి ఈ సమాజానికి, ఈప్రజలకు సేవ చేయాలని కాంక్షించారు. విద్యార్థులు భవిష్యత్తులో సాధించే విజయాలు తమిళనాడు చరిత్రను సృష్టించే విధంగా ఉండాలని, ఇందు కోసం ఒక స్నేహితుడిగా, తల్లిదండ్రిగా ఈ ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ ఎల్లప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటాడని, తాను ఇక్కడే ఉన్నాను..ఉంటాను నిరంతరం ఈ సేవ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

చరిత్ర సృష్టించాలి..!1
1/1

చరిత్ర సృష్టించాలి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement