
120 చోట్ల అలర్ట్
సాక్షి, చైన్నె : చైన్నెలో 120 ప్రాంతాలు అతి భారీ వర్షాలు కురిస్తే ముంపునకు గురి అయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. ఇక్కడ నీళ్లు చేరకుండా ముందు జాగ్రత్తలపై కార్పొరేషన్ యంత్రాంగం దృష్టి పెట్టింది. నష్టాన్ని నివారించేందుకు, సహాయక చర్యలు విస్తృతం చేయడానికి 7 వేలు మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వివరాలు.. నైరుతీ రుతుపవనాల సీజన్ ముగిసినట్టే. ఇక, ఈశాన్య రుతు పవనాలు మరి కొద్దిరోజులలో ప్రవేశించబోతున్నాయి. ఏటా ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో చైన్నె నీట మునిగే పరిస్థితి పరిపాటే. అయితే గత మూడేళ్లుగా చైన్నె నగరం అంతా విస్తృతంగా వర్షపు నీటి కాలువల నిర్మాణాలపై దృష్టి పెట్టి, నీరు త్వరితగతిన కూవం, అడయార్ నదిలో కలిసే విధంగా చర్యలు చేపట్టారు. ఏడాదికా ఏడాది నీటి నిల్వ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం చైన్నె నగరం అంతా దాదాపుగా వర్షపు నీటి కాలువ నిర్మాణాలు ముగింపు దశలో ఉన్నాయి. ఇది వరకు వర్షం పడితే వందలాది ప్రాంతాలు రోజుల తరబడి జల దిగ్భంధంలో ఉండాల్సిందే. అయితే, గత ఏడాది ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో కురిసిన వర్షం గానీయండి, తుఫాన్‌రూపంలో ఎదురైన పరిణామాల గానీయండి ఆతదుపరి నీరుత్వరితగతిన లోతట్టు ప్రాంతాల నుంచి బయటకు వెళ్లాయి. ఈ పరిస్థితులలో ఈ ఏడాది ఈశాన్య రుతు పవనాల సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ఇంకా వరద ముంపునకు గురి అయ్యే ప్రాంతాలు ఏన్ని ఉన్నాయో అని గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ వర్గాలు సమగ్ర వివరాలను సేకరించారు.
120 ప్రాంతాలలో ముందస్తు చర్యలు..
కొగుంగయూరు, వ్యాసార్పాడి, కొళత్తూరు, పెరంబూరు, పళ్లికరణై, వేళచ్చేరి పరిధిలో 120 ప్రాంతాలు భారీ వర్షలు పడితే ముంపునకు గురి అయ్యే పరిస్థితి ఉన్నట్టు గుర్తించారు. వరద ముంపునకు గురి అయ్యే ప్రాంతాలలలో ముందు జాగ్రత్తలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రాక్టర్‌తో కూడిన 150 మోటారు పంపులను ఈ ప్రాంతాలలో సహాయక చర్యలకు సిద్ధం చేశారు. ఇప్పటికే ఐదు వందల మోటారు పంపులు ఉండగా,మరో 150 కొనుగోలు చేశారు. అలాగే, 17 పడవలను కొనుగోలుచేసి, ఏదేని ముంపు ఎదురైన పక్షంలో బాధితులను రక్షించేందుకు సిద్ధమయ్యారు. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలు చేపట్టడం వంటి అంశాలపై 7 వేల మందికి శిక్షణ సైతం పూర్తి చేశారు. వీరంతా వరద ముంపునకు గురి అయ్యే ప్రాంతాల పరిధిలోని మండల కేంద్రాలలో ఇక తిష్ట వేసి ఉంటారు. వర్షం పడితే చాలు తక్షణం ఆయా ప్రాంతాలకు వెళ్లి పోతారు. ఆయా ప్రాంతాలలో నీళ్లు అధికంగా చేరే చోట్ల మోటారు పంపులను అమర్చే పనులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. అలాగే సబ్ వేలలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాల పనితీరుతోపాటుగా ఇవినీటి మునిగితే హెచ్చరికల అలారం మోగించేందుకు చేసిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. చైన్నెలో ఈ సారి భారీ వర్షం పడ్డప్పటికీ నీరు నిల్వ ఉండకుండా తక్షణం తరలించేందుకు వీలుగా కార్పొరేషన్ వర్గాలు విస్తృత చర్యలపై దృష్టి పెట్టారు. శనివారం రాత్రికి ఉత్తర చైన్నె పరిధిలో కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలపై రోడ్డుపై చేరిన నీరు గంటల వ్యవధిలో తొలగిన దృష్ట్యా, ఆయా ప్రాంతాలలోని వర్షపు నీటి కాలువలల చెత్తా చెదారాలు చేరకుండా జాగ్రత్తలను వేగవంతం చేశారు. అలాగే అధికారులతో మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్ కుమార్, కమిషనర్ కుమర గురుబరన్ తదితరులు సోమవారం కూడా ముందస్తు ఏర్పాట్లుపై సమీక్షించారు.

120 చోట్ల అలర్ట్