
160 ఏళ్ల నాటి రిజిస్ట్రేషన్ శాఖ భవనానికి మెరుగులు
కొరుక్కుపేట: చైన్నెలోని రాజాజీ రోడ్డులో ఉన్న 160 ఏళ్ల నాటి రిజిస్ట్రేషన్ శాఖ పాత భవనంలో రూ.2.16 కోట్లతో పునరుద్ధరించిన ఆధునిక సమావేశ మందిరాన్ని మంత్రి పి.మూర్తి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వివరాలు.. 1864లో ఇండో–సార్సెనిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. టేకు కలప దూలాలతో నిర్మించిన ఈ చారిత్రాత్మక రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సముదాయాన్ని దాని అసలు రూపురేఖలు మారకుండా రూ. 2.16 కోట్లతో పునరుద్ధరించారు. ఈ ఆధునిక సమావేశ గది ప్రొజెక్టర్, ఎల్‌ఈడి స్క్రీన్, వైఫై, అద్భుతమైన ఆడియో, వీడియో, స్పీకర్ సౌకర్యాలతో 150 మంది వరకు కూర్చొనేలా పునరుద్దరించారు. ఈ మేరకు పునరుద్ధరించబడిన ఆధునిక సమావేశ మందిరాన్ని తమిళనాడు వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ మంత్రి పి. మూర్తి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శిల్పా ప్రభాకర్ సతీష్, డీడ్స్ రిజిస్ట్రేషన్ విభాగం అధిపతి దినేష్ పొన్ రాజ్ ఆలివర్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.