
రాజీ పడేనా.?
అందరూ ఒక్కటయ్యేనా నేడు ఢిల్లీకి పళణి మంచే జరుగుతుందన్న నైనార్ అర్థం చేసుకుంటారని సెంగోట్టయన్ వ్యాఖ్య
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో అందరూ ఏకం అయ్యేనా? అమిత్ షా పంచాయితీతో పళణి రాజీపడేనా..? అన్న చర్చ ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఢిల్లీ పర్యటనపై ఎదురు చూపులు పెరిగాయి. అన్నాడీఎంకేలో తలా ఓ శిబిరంగా నేతలు ఉన్న విషయం తెలిసిందే. బహిష్కృత నేతలు మాజీ సీఎం పన్నీరు సెల్వం ఓ వైపు, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ మరో వైపు, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ఇంకో వైపు అంటూ కేడర్ ముక్కలై ఉన్నారు. వీరందర్నీ కలుపుకు వెళ్దామంటూ పెదవి విప్పిన సీనియర్‌నేత సెంగోట్టయన్‌ను పార్టీ పదవి నుంచి తప్పించిన పళణి స్వామి, బహిష్కృతలకు చోటు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. సెంగోట్టయన్ ఢిల్లీ వెళ్లి వచ్చినానంతరం అనూహ్యంగా పరిగణామాలు మారుతున్నాయి. సెంగోట్టయన్‌తో టచ్‌లోకి మాజీ సీఎం పన్నీరు సెల్వ వెళ్లారు. ఈ ఇద్దరు వ్యూహాకలు పదును పెట్టారు. ఇక, ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగి ఢిల్లీ తన వైపు చూసే దిశగా టీటీవి దినకరన్ వ్యూహం రచించి సఫలీకృతులయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో అన్నాడీఎంకే సమన్వయ పంచాయతీని కొలిక్కి తె చ్చే వ్యూహంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. చెల్ల చెదురుగా ఉన్న కేడర్‌తో పాటూ నేతలందరూ ఏకమైనప్పుడే డీఎంకేను గద్దె దించగలమన్న భావనలో బీజేపీ సైతం ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందుకే పళణి స్వామిని ఢిల్లీకి పిలిపించి సమష్టి సమన్వయం ఉపదేశం చేయడానికి అమిత్ షా నిర్ణయించినట్టు సమాచారం. మంగళవారం ఢిల్లీ వెళ్లే పళణి స్వామి, బుధ, గురువారాలు అక్కడే ఉంటారు. ఈ పంచాయతీ బుజ్జగింపులలో ఆయన రాజీ పడేనా లేదా, బీజేపీ అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా ముందుకు సాగేనా అన్నది వేచి చూడాల్సి ఉంది. అదే సమయంలో పళణి ఢిల్లీ పర్యటన గురించి బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, అన్నీ మంచే జరుగుతాయని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, సెంగోట్టయన్ స్పందిస్తూ, అర్థం అయ్యే విధంగా చెబితే అర్థం చేసుకుంటారని వ్యాఖ్యలు చేయడం ఆలోచించాల్సిందే. ఢిల్లీ పర్యటనలో పళని స్వామి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపి నడ్డాతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌లను కలిసేందుకు నిర్ణయించి ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.