
దేవా సోదరులకు సత్కారం
తమిళసినిమా: తమిళసినిమా పరిశ్రమలో సంగీత ద్వయం అంటే విశ్వనాథన్ –రామమూర్తి, శంకర్–గణేశ్ తరువాత స్థానం దేవా కుటుంబానిదే. ముఖ్యంగా సంగీత దర్శకుడు దేవా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన తమిళం,తెలుగు తదితర భాషల్లో అనేక చిత్రాలను చేశారు. కాగా ఈయన మూడు తరాల కుటుంబం సంగీతానికే అంకితం అయ్యింది. దేవా సోదరులు సబేష్–మురళిల ద్వయం సంగీత దర్శకులుగా రాణిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు సినీ సంగీత కళాకారుల సంఘానికి అధ్యకులుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దేవా మరో ఇద్దరు సోదరుల్లలో శశి సంగీతదర్శకుడిగానూ, సంపత్ తబలిస్ట్‌గానూ రాణిస్తున్నారు. దేవా వారసుడు శ్రీకాంత్ దేవా జాతీయ అవార్డును గెలుసుకుని ప్రముఖ సంగీతదర్శకుడిగా వెలుగొందుతున్నారు. దేవా కూతురు సంగీత భాస్కర్ కూడా గాయని అన్నది గమనార్హం. కాగా ప్రస్తుతం సినీ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహిస్తున్న సబేష్–మురళి ద్వయాన్ని మది ఆర్ట్స్ అకాడమీ ఘనంగా సత్కరించి లైఫ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది. ఈ వేడుక ఆదివారం సాయంత్రం స్థానిక కోటూర్‌పురంలోని అన్నా శతాబ్ది ఆవరణలో జరిగింది. ఇందులో పార్లమెంట్ సభ్యులు కేఎస్. ఇళంగోవన్,డా.కరుణాకరన్, సంగీత దర్శకుడు దేవా, శ్రీకాంత్‌దేవా మొదలగు పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు కేఎస్.ఇళయంగోవన్ సంగీతద్వయం సబేష్–మురళిను లైఫ్ ఎచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా తన సోదరులు సబేష్–మురళికి దక్కిన ఈ గౌరవం తన కుటుంబానికి దక్కినట్టుగా భావిస్తున్నట్లు సంగీతదర్శకుడు దేవా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కలైమామణి అవార్డు గ్రహీత, సీనియర్ పాత్రికేయుడు నైలె సుందరరాజన్ సంగీతద్వయం సబేష్–మురళిని పూలమాలతో ఘనంగా సత్కరించారు.
సంగీత ద్వయం సబేష్–మురళిని
సత్కరించిన ఎంపీ కేఎస్ ఇళంగోవన్ తదితరులు