
ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో..?
తమిళసినిమా: నటి తమన్నా గురించి నిత్యం ఏదో ఒక వార్త మీడియాలో ప్రచారం అవుతూనే ఉంటుంది. ఈమె తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ స్టార్స్ అందరితోనూ జత కట్టి అగ్ర కథానాయకల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే అవకాశాలను అందుకుంటున్నారు. కాగా ఇంతకు ముందు వదంతుల్లో చిక్కుకోని ఈ మిల్కీబ్యూటీ ఆ మధ్య బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో ప్రేమలో మునిగి తేలి వార్తల్లోకెక్కారు. ఇద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్‌లో నటించారు. ఆ వెబ్ సిరీస్‌లో రొమాన్స్ సన్నివేశాల్లో జీవించారు. అంతేకాదు అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమాయణం మొదలయ్యింది. బహిరంగంగానే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంతే కాదు ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. అలాంటిది ఏమయిందో కానీ సడన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో 35 ఏళ్ల పరువాల మిల్కీ బ్యూటీ మళ్లీ నటనపై దృష్టి సారించారు. ప్రత్యేక పాటల్లో నటించడం తనకు తానే సాటి అని నిరూపించుకున్న తమన్నా ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ తీవ్ర కసరత్తులతో స్లిమ్‌గా తయారయ్యారు కూడా. కాగా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ‘‘నేను మంచి జీవిత భాగస్వామిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. నేను అర్ధాంగిగా లభించడం పూర్వజన్మ సుకృతం అని నాకు జీవితభాగస్వామిగా వచ్చే వ్యక్తి భావించాలి. అలాంటి అదృష్ణవంతుడు నాకు జీవితభాగస్వామి కావాలి. ఆ అదృష్టవంతుడు ఎవరన్నది తెలుసుకోవడానికి నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అది ఎవరికి దక్కుతుందో తెలియడం లేదు’’ అని నటి తమన్నా పేర్కొన్నారు. దీంతో అ భామకి మళ్లీ పెళ్లిపై కోరిక పెరుగుతోందనుకుంటా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా తమన్నాను జీవిత భాగస్వామిగా పొందే లక్కు ఎవరికి దక్కుతుందో చూడాలి.