
ఇళయరాజా పేరిట అవార్డు
సాక్షి, చైన్నె: సంగీత జ్ఞాని ఇళయరాజ పేరిట సంగీత కారులకు ఏటా తమిళనాడు ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేయనుంది. ఈ మేరకు సీఎంస్టాలిన్ ప్రకటించారు. అలాగే ఇళయరాజకు భారత రత్నా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీసింఫనీ శిఖరాన్ని చేరుకున్న సంగీత జ్ఞాని ఇళయరాజకు చిత్ర పరిశ్రమలో స్వర్ణోత్సవ వేడుక శనివారం రాత్రి నెహ్రూ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. సంగీత కార్యక్రమాలతో పొద్దు పోయే వరకు ఈ వేడుక జరిగింది. ఇందులో నటులు రజనీ కాంత్, కమలహాసన్ తమ ప్రసంగంలో ఇళయరాజతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రజనీ, ఇళయరాజా అయితే, షూటింగ్ సమయాల్లో గానీయండి, ఆటవిడుపు వేళలో గానీయండి, తమ మధ్య ఆనందకర క్షణాలను గుర్తు చేసుకున్నారు. చివరకు ఇళయరాజాను సత్కరించుకుని అనంతరం సీఎం స్టాలిన్ ప్రసంగించారు. ఆయనకు తాను ఓ అభిమానిగా పేర్కొంటూ, శ్రీరాజ... రాజాది రాజ, నిన్న కాదు, రేపు కాదు. కాదు, ఎప్పుడూ నువ్వే ఎప్పుడూ రాజ అన్న సినీ పల్లవితో సంగీత జ్ఞానికి నీరాజనం పలికారు. రాజాకు ప్రశంసలు, సత్కారాలు కొత్త కావు అని పేర్కొంటూ, ఆయన జీవితంలో ఈ వేడుకు ఒక మరపు రానిదిగా నిలవాలన్నదే ఆకాంక్షగా పేర్కొన్నారు. ఇళయరాజా పాటలను గుర్తు చేస్తూ, ఇక, తమిళనాడు ప్రభుత్వం నేతృత్వంలో ప్రతి సంవత్సరం సంగీత రంగంలోని వారికి ఇళయరాజ పేరిట అవార్డును ప్రదానం చేయనున్నామని ప్రకటించారు. అలాగే ఇళయరాజకు ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కచ్చితంగా ఆయనకు ఈ అవార్డు దక్కుతుందని, ఇళయరాజా చిరకాలం జీవించాలని, సంగీత రాజుగానే ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే సింఫని సంగీత నిర్వాహకుడు మైఖెల్ టామ్స్‌ను సైతం ఈ వేదికపై సీఎం స్టాలిన్ సత్కరించారు.

ఇళయరాజా పేరిట అవార్డు