
క్లుప్తంగా
సాక్షి, చైన్నె: గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌కు ముందుగానే ప్రైమ్ సభ్యుల కోసం ప్రైమ్ థమాకాతో యర్లీ డీల్స్‌ను ఆవిష్కరించామని అమెజాన్ ఇండియా ఆదివారం ప్రకటించింది. వార్షిక పండుగలో భాగంగా ప్రీ ఫెస్టివల్ ఆఫర్‌లను ఆస్వాదించేందుకు ఈ యర్లీ డీల్స్‌ను ప్రారంభించామని ఆసంస్థ ఉపాధ్యక్షుడు సౌరభ్ శ్రీవస్తవ స్థానికంగా వివరించారు. ఈ నెల 23వతేది నుంచి జరిగే ఈ ఫెస్టివల్ ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రైమ్ సభ్యులు 24 గంటల ముందే యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ వేడకలో ఏఐ ఆధారిత సాధనాలు, విస్తరించిన డెలివరీ నెట్ వర్క్, ప్రత్యేకమైన వినోద అంశాలు తదితర విలువలతో సాఫింగ్ అనుభవానికి హామీ ఇస్తున్నామని వివరించారు.
వేలూరు: వృద్ధులందరికీ ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను సక్రమంగా సరఫరా చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. వేలూరు ఓల్డ్‌టౌన్ ప్రాంతంలో 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర వస్తువులు ఇంటి వద్దకే అందజేసే పథకాన్ని ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రేషన్ దుకాణ దారులతో పాటు వృద్ధుల వద్ద నేరుగా సరుకులు ప్రతినెలా సక్రమంగా అందజేస్తున్నారా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వృద్ధులందరికీ రేషన్ దుకాణానికి రాలేని పరిస్థితిలో ఉండడంతో రేషన్ కార్డు కలిగిన వృద్ధులకు నేరుగా ఇంటి వద్దనే సరుకులు అందజేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. రేషన్ దుకాణ సిబ్బంది శని, ఆదివారాల్లో ఇంటింటికీ వెళ్లి సరుకులను అందజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాల ద్వారా వృద్ధులకు సరఫరా చేస్తున్నారా? లేదా? అనే విషయాలపై ఆయా తాలుకా తహశీల్దార్‌లు నేరుగా విచారణ జరిపాలని ఆదేశించడం జరిగిందన్నారు. తహశీల్దార్‌లు, సివిల్ సప్లే అధికారులు నిత్యావసర వస్తువుల నాణ్యత, సక్రమంగా అందజేస్తున్నారా? అనే వాటిపై నేరుగా వెళ్లి తనిఖీలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌తో పాటూ తహశీల్దార్ వడివేలు, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.
తిరువొత్తియూరు: ఆవడి సమీపంలో అనుమానంతో భార్యను కత్తితో పొడిచి, పోలీసు విచారణకు భయపడి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆవడి సమీపంలోని ముత్తాపుదుపేట కరిమేడు అన్నానగర్ 3వ వీధికి చెందిన వ్యక్తి శరణ్ రాజ్ (38) భార్య షీలా రాణి (35). వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శరణ్ రాజ్ తన భార్య షీలా రాణి ప్రవర్తనపై అనుమానం పెంచుకుని తరచుగా గొడవపడేవాడు. దీంతో షీలా రాణి శుక్రవారం కోపంతో అదే ప్రాంతంలోని తన పిన్ని ఇంటికి వెళ్లిపోయింది. దీంతో భర్త శరణ్ రాజ్ భార్య షీలా రాణిని శాంతింపజేసి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన శరణ్‌రాజ్ కత్తితో షీలా రాణి మెడ, చేయి, కడుపు భాగంలో పొడిచాడు. షీలారాణి కింద పడి పోవడంతో భార్య చనిపోయిందని భావించిన శరణ్‌రాజ్, పోలీసుల విచారణకు భయపడి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న ముత్తాపుదుపేట్టై పోలీసులు తీవ్రంగా గాయపడిన షీలారాణిని, ఉరివేసుకున్న శరణ్‌రాజ్‌ను ఆవడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే శరణ్‌రాజ్ మరణించినట్లు తెలిపారు. అలాగే, షీలా రాణికి ప్రథమ చికిత్స అందించి తదుపరి చికిత్స కోసం కీల్‌పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.