
సేవలతో సాయి శతాబ్ది ఉత్సవాలు
సాక్షి, చైన్నె: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను తమిళనాడులో సంక్షేమం, సేవా కార్యక్రమాలతో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలతో బ్రోచర్‌ను ఆదివారం విడుదల చేశారు. తమిళనాడులోని శ్రీ సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షుడు ఎస్‌ఆర్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక, విద్యా , సేవ అనే మూడు సమగ్ర విభాగాల ద్వారా తమిళనాడులో సాయి సేవా సంస్థలు పనిచేస్తున్నట్టు వివరించారు. భగవాన్ సత్యసాయి బాబా వ్యక్తిత్వం, కరుణ, సమగ్ర ధృక్పథంతో శతాబ్ది ఉత్సవాలు కేవలం ఒక జ్ఞాపకార్థం మాత్రమే కాకుండా ఆయన చూపిన సార్వత్రిక ప్రేమ ,సేవ ల రూపంలో దైవిక సందేశాన్ని బలోపేతం చేసే ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లనున్నామన్నారు. సేవ, సంక్షేమ కార్యకలాపాల ద్వారా మరిన్ని జీవితాలను చేరుకోవడం, నిస్వార్థ సేవ మార్గాన్ని స్వీకరించడానికి సమాజాన్ని ప్రేరేపించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. చైన్నెలోని శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ ద్వారా 30 గ్రామాలలో వైద్య శిబిరాలు, అన్ని రకాల వైద్య పరిశోధనలు నిర్వహించనున్నామన్నారు. రక్త దాన శిబిరాలు, నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా జ్యోతిని నింపే విధంగా పాఠశాలలకు మౌళిక సదుపాయాలు, పుస్తకాలు పంపిణి తదితర కార్యక్రమాలు, దివ్యాంగులకు తోడ్పాటు వంటి కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లనున్నామని వివరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రామ్ మోహన్‌రావు, ముకుందన్, కోటేశ్వరరావు, నిమిష్ పాండే, శ్రీధర్ పాల్గొన్నారు.