
2026లో నేనే సీఎం అంటున్న పార్తీపన్
తమిళసినిమా: నటుడు, దర్శకుడు, నిర్మాత పార్థీపన్ బాణీయే వేరుగా ఉంటుంది. ఆయన చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా ఇటీవల ఈయన ‘‘నేను రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాను, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ఈనేపథ్యంలో నేను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను., 2026లో తానే సీఎం అని ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా పెద్దలారా, తల్లులారా, ఓటరు మహాశయులారా మీ ఓటును బోటు గుర్తుకు వేసి నా చోత్తు కట్చి (అన్నం పార్టీ గెలిపించండి. నన్ను గెలిపించుకోవడం మీ బాధ్యత. నేను సీఎం సీటులో కూర్చున్న వెంటనే చేయబోయే తొలి సంతకం ఆ తరువాత ఈ సీటులో ఎవరూ కూర్చోకూడదన్నదే. ఇట్లు సీఎం.సింగారవేలన్ అనే నేను’’ అని పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విషయం ఏమిటంటే నటుడు పార్తీపన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ 2026 మొదల్ నాందాన్ సీఎం అనే పేరుతో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా తమిళనాడులో 2026లో శాసనసభ ఎన్నికలు జరగనున్న రాజకీయ నేపథ్యంలో పార్తీపన్ రూపొందిస్తున్న నాందాన్ సీఎం చిత్రంపై ఆసక్తి నెలకొంది. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.