
పెరంబలూరు ప్రజలకు క్షమాపణ
సాక్షి, చైన్నె : పెరంబలూరు జిల్లా ప్రజలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ క్షమాపణలు కోరారు. మరో మారు మీ ముందుకు వస్తానని ఆదివారం వ్యాఖ్యలు చేశారు. విజయ్ తన ఎన్నికల ప్రచారానికి శనివారం తిరుచ్చిలో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరుచ్చిలో ఆయనకు ఎవ్వరూ ఊహించని రీతిలో అభిమాన నీరాజనం బ్రహ్మాండంగా పలికారు. 6 కి.మీ దూరాన్ని ఆయన చేదించేందుకు 5 గంటలు సమయంపట్టింది. ఇక్కడి నుంచి అరియలూరుకు బయలుదేరారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాలలో అభిమానుల ఆహ్వానాలు అందుకుంటూ అరియలూరుకు వెళ్లేలోపు రాత్రి ఎనిమిదిన్నర గంటలైంది. ఇక్కడి నుంచి ఆయన పెరంబలూరు జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. పెరంబలూరు చేరుకునేలోపు అర్ధంరాత్రి సమయం పట్టింది. దీంతో అక్కడున్న ప్రజలకు ఆయన కేవలం వాహనం నుంచి అభివాదం తెలిపి ముందుకెళ్లారు. సాయంత్రం నుంచి కొన్ని గంటల పాటూ విజయ్ రాక కోసం పెద్ద ఎత్తున జనం వేచి ఉన్నప్పటికీ, ఆయన వారిని పూర్తిస్థాయిలో పలకరించేందుకు నిబంధనలు అడ్డు వచ్చాయి. దీంతో వాహనం నుంచే అభివాదం తెలుపుతూ ముందుకు వెళ్లారు. ఇదే పరిస్థితి కున్నంలోనూ నెలకొంది. ఈ జాప్యంపై విమర్శలు గుప్పించే వాళ్లు పెరగడంతో విజయ్ ఆదివారం ఆ జిల్లా ప్రజలకు క్షమాపణలు కోరుతూ లేఖ రాశారు. అభిమానులందర్నీ పలకరిస్తూ పెరంబలూరు చేరుకునేలోపు అర్ధరాత్రి సమయం పట్టిందని, అందుకే ఎవ్వరినీ పలకరించ లేక ముందుకు వెళ్లాల్సి వచ్చినందుకు తీవ్ర వేదనతో ఉన్నానని వాఖ్యలు చేశారు. తాను మరో మారు పెరంబలూరుకు వస్తానని, అప్పుడు అందర్నీ కలుస్తానని హామీ ఇచ్చారు. ఈసారి తనను క్షమించాలని విన్నవించారు. అదే సమయంలో డీఎంకే పాలకులు తనపై విమర్శలు ఎక్కుపెట్టడంతో విజయ్ ఎదురు దాడి చేశారు. విజయ్ రాడు, జనంలోకి వెళ్లడు అంటూ కట్టుకథలు అల్లిన వారికి తిరుచ్చి జన సమూహం ఓ చెంప పెట్టుగా మారిందని, అందుకే విజయ్‌కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. తరలి వచ్చిన జనసాగరాన్ని చూసి అధికార పక్షంలో వణుకు బయలు దేరిందని, అందుకే ముప్పెరుం విళా లేఖ అంటూ సీఎం స్టాలిన్ సైతం తన కార్యకర్తలకు రాసిన లేఖలో తనను టార్గెట్ చేయడం గమనించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. అదే సమయంలో తన తొలి ప్రచార పర్యటనను దిగ్విజయవంతం చేసిన కేడర్‌కు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.