
హత్యా..ఆత్మహత్యా?
అడవి మధ్యలో నాలుగు
మృతదేహాలు
ఒకే కుటుంబంగా అనుమానం
పురుషుడు ఉరివేసుకోగా.. పక్కనే పడి ఉన్న మహిళ మృతదేహం
సమీపంలోనే ఇద్దరిని పూడ్చిపెట్టిన ఆనవాళ్లు
తమిళనాడు వాసులేనా?
పిల్లల్ని చంపి ఆపై తల్లిదండ్రులు
బలవన్మరణానికి పాల్పడ్డారా?
పాకాల: ఘటనా స్థలంలో మృతదేహాలు ఉన్న తీరు, పక్కనే రెండు గుంతల్లో మరో రెండు మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు ఉన్న గుంతలు.. వాటిపై గుర్తుగా పెట్టిన రాళ్లు.. వీళ్లు ఒకే కుటుంబమా..? అనే అనుమానం కలుగుతోంది. వీరు నట్టడివిలోకి ఎలా వచ్చారు.. ఎలా మృతిచెందారు అనేదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. లేక ఏదైనా కష్టమొచ్చి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందో తెలియడం లేదు. పాకాల మండలంలో బయటపడిన ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం.. పాకాల మండల పరిధిలోని పవిత్ర హోటల్ వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలను అటవీశాఖ సిబ్బంది గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పవిత్ర హోటల్ నుంచి 3కిలో మీటర్ల దూరంలో ఉన్న ఘటనా స్థలానికి సీఐ సుదర్శన్‌ప్రసాద్ తన సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. అక్కడ ఒక పురుషుడి మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. సమీపంలోనే మహిళ మృతదేహం కింద పడి ఉంది. అక్కడే మరో ఇద్దరిని పూడ్చి పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ గుంతలపై గుర్తుగా బండరాళ్లు పెట్టి ఉన్నారు. గుంతలను తవ్వేందుకు ఉపయోగించిన పారను చెట్ల పొదల్లో పడేసి ఉన్నారు.
అడవి మధ్యలో ఏం జరిగింది?
పాకాల మండలం శివారు ప్రాంతం అడవిలోని నామాల బండ సమీపం, మూలకుంట వద్ద ఇద్దరి మృతదేహాలతోపాటు చిన్న పిల్లలను గుంతలో పూడ్చి పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో పిల్లల దుస్తులు కనిపించాయి.
తమిళనాడు వాసులేనా?
మృతదేహాల వద్ద ఓ నోకియో ఫోన్ లభించింది. అలాగే కళై సెల్వన్ పేరు మీదున్న తంజావూరు క్రిస్ ఆస్పత్రి ప్రిస్క్రిప్షన్ లభ్యమైంది. మృతులు తమిళనాడు వాసులగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నయం కాని జబ్బు ఏదైనా బయటపడిందా..?.. సమాజాన్ని ఎదిరించి బతకలేక.. ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అనే అను మానం కలుగుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియడం లేదు. లేక ఆస్తి పంపకాల్లో తేడాలొచ్చి బంధువులెవరైనా ఇక్కడకు తీసుకొచ్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించారో.. పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలావుండగా మృతదేహాలు దొరికిన ప్రాంతం పాకాల మండల పరిధిలో లేకపోవడంతో కేసును చంద్రగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టు కింద పడి ఉన్న మహిళ మృతదేహం
చెట్టుకు వేలాడుతున్న పురుషుడి మృతదేహం

హత్యా..ఆత్మహత్యా?