
నంబర్ –1
దక్షిణాసియాలోనే
దక్షిణాసియాలోనే నంబర్ –1 రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్ది తీరుతానని సీఎం ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశానికే మార్గదర్శకంగా, ఆదర్శ రాష్ట్రంగా తమిళనాడు అవతరించి ఉందని వ్యాఖ్యలు చేశారు. కృష్ణగిరిలో ఆదివారం సీఎం రోడ్ షోకు జనం నీరాజనాలు పలికారు.
అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం స్టాలిన్ కృష్ణగిరిలో రెండు రోజుల పర్యటనకు నిర్ణయించారు. గురు, శుక్రవారాలలో ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా గురువారం కృష్ణగిరి జిల్లా హోసూరు వేదికగా జరిగిన పెట్టుబడి దారుల సమావేశంలో 49,353 మందికి ఉద్యోగ కల్పన దిశగా రూ. 24,307 కోట్ల పెట్టుబడికి సంబంధించిన 92 అవగాహన ఒప్పందాలు సీఎం స్టాలిన్ సమక్షంలో జరిగాయి. అదే రోజున తన అల్లుడు శబరీషన్ తండ్రి, వియ్యంకుడు వేదమూర్తి మరణంతో రెండో రోజు శుక్రవారం జరగాల్సిన పర్యటనను ఆదివారానికి మార్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయాన్నే చైన్నె నుంచి హోసూరుకు చేరుకున్న సీఎం స్టాలిన్ బ్రహ్మాండ రోడ్ షో నిర్వహించారు. అనేక ప్రాంతాలలో వాహనం నుంచి కేడర్‌కు, జనానికి అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. హోసూర్ విమానాశ్రయం నుంచి శూలగిరి, కుందరపల్లి మీదుగా కృష్ణగిరి వరకు సీఎం రోడ్ షో జరిగింది. కృష్ణగిరి నగరంలో 3 కి.మీ దూరంకు పైగా నడచుకుంటూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజల్ని పలకరిస్తూ, వారి విజ్ఞప్తులను స్వీకరిస్తూ ముందుకు సాగారు. సీఎం స్టాలిన్‌కు జనం ఈసందర్బంగా నీరాజనాలు పలకడమే కాకుండా, తమ సమస్యలతో వినతి పత్రాలను పెద్ద సంఖ్యలో అందజేశారు.
సంక్షేమ పథకాల పంపిణీ..
కృష్ణగిరిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో రూ. 270 కోట్ల 75 లక్షలతో పూర్తి చేసిన 193 వివిధ పనులను ప్రారంభించారు. రూ. 562.14 కోట్లతో చేపట్టనున్న 1,114 కొత్త పనులకు శంకు స్థాపన చేశారు. అలాగే రూ.2,052 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను 2,23,013 మంది లబ్దిదారులకు అందజేశారు. పూర్తి చేసిన పనులలో ప్రధానంగా మైనర్ పోర్టుల శాఖ తరపున డెంకని కోట, తలి, రాయకోట్టై, అత్తిల్లి, జండమేడు, పులియూరు, పోచంపల్లి, కల్లావి మార్గంలో రూ. 120 కోట్లతో పూర్తి చేసిన ఫోర్‌వే పనులు ఉన్నాయి. అలాగే గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ తరపున వివిధ ప్రదేశాలలో కొత్త వంతెనలు, ప్రజారోగ్య కేంద్రాలు భవనాలు, తరగతి గది భవనాలు, కంప్యూటర్ తరగతి గదులు, పాఠశాల భవనం, గిడ్డంగులు, పంచాయతీ కౌన్సిల్ భవనాలు, ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, పాల ఉత్పత్తిదారుల సంఘాల కార్యాలయాలు, తదితర నిర్మాణాలు ఉన్నాయి. కొత్తగా చేపట్టనున్న పనులలో గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్‌శాఖతరపున వివిధ ప్రాంతాలలో హై–లెవల్ వంతెనలు, రోడ్డు విస్తరణ , అద్దకం, మురికి నీటి సుద్దీకరణ కేంద్రాలు బస్టాండ్‌ల పునరుద్ధరణ, రెవెన్యూ కార్యాలయాలు తదితర పనులు ఉన్నాయి. ఇక రెవెన్యూ శాఖ తరపున 77,002 మంది లబ్ధిదారులకు ఉచిత గృహాలు, మరో 8,709 మందికి గృహ నిర్మాణానికి రుణాలు, 180 మందికి ఇంటి పట్టాలు, 75 మంది రైతులకు ఆర్థికసాయం , దివ్యాంగులకు స్కూటర్లు, రైతులకు వ్యవసాయ ప్రోత్సహకాలను తదితర వాటిని లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి చక్రపాణి, ఎంపీ గోపీనాథ్, ఎమ్మెల్యేలు మదిఅళగన్, ప్రకాష్, రామచంద్రన్, మేయర్ ఎస్‌ఏ సత్య , కలెక్టర్ దినేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశానికే తలమానికం..
ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ కృష్ణగిరి ప్రగతిని కాంక్షిస్తూ ఇప్పటి వరకు చేపట్టిన, భవిష్యత్‌లో చేయనున్న అభివృద్ధి పనులను వివరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలన్నీ దాదాపుగా అమల్లోకి తెచ్చామని గుర్తుచేశారు. అయితే రాజకీయంగా ఎదుర్కొన లేక తన ప్రభుత్వంపై నిందులు వేయడమే లక్ష్యంగా కొందరు బయలు దేరి ఉన్నారని మండిపడ్డారు. ఓటు వేసిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. ఇప్పటికే అనేక అంశాల గురించి మంత్రులు స్పష్టత ఇచ్చినా, మళ్లీ పదే పదే పాత పాటే పాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునే దిశగా తాను ముందుకెళ్తున్నా, విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెస్తున్నా, విమర్శించే వాళ్లు విమర్శిస్తునే ఉన్నారన్నారు. ఇందులో ప్రతిపక్ష నేత పళణి స్వామి ముందున్నారంటూ, గతంలో ఆయన చేసిన తప్పిదాలను తాము చేస్తామని భావిస్తున్నట్టుందని, ఇక్కడున్నది ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అన్నది గుర్తెరగాలని హితవు పలికారు. తాము చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమాలు, వివిధ పథకాలు, ఇచ్చిన వాగ్దానాల అమలు 2026 ఎన్నికల్లో కూడా కచ్చితంగా తామే గెలుస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ద్రావిడ మోడల్ 2. ఓలో దక్షిణ ఆసియాలోనే తమిళనాడు నెంబర్–1 రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. తాజాగా తమిళనాడు దేశానికే ఆదర్శంగా మారిందని, ఉత్తరాది మీడియా సైతం తమిళనాడు ప్రగతి, అభివృద్ధిని హైలెట్ చేస్తూ, అక్కడి ప్రభుత్వాలను నిలదీసే పనిలో పడ్డాయన్నారు.

నంబర్ –1

నంబర్ –1