
‘అన్బుకరంగళ్’
●కొత్త పథకానికి ప్రభుత్వం నిర్ణయం ●తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ. 2 వేలు పంపిణీ
సాక్షి, చైన్నె : తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను అక్కున చేర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్బుకరంగళ్(ఆపన్న హస్తం) పేరిట పథకం అమలుకు నిర్ణయించింది. 18 సంవత్సరాల వయస్సులోపు పిల్లలకు నెలకు రూ. 2 వేలు నగదును స్కాలర్ షిప్‌గా ఈ పథకం ద్వారా అందజేయనున్నారు. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, ప్రోత్సాహక పథకాల గురించి తెలిసిందే. ఇందులో భాగంగా సంపన్నమైన తమిళనాడును సృస్టించేందుకు పిల్లల విద్య, సమతుల్య అభివృద్ధిని కాంక్షింస్తూ వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. అత్యంత పేదరికంలో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించడం, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు, తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయి, మరొకరి సంరక్షణ పొందలేక పోతున్న పిల్లలను అక్కున చేర్చుకునేదుకు ప్రభుత్వం సిద్ధమైంది. తల్లిదండ్రుల ఆదరణ అన్నది లేకపోవడంతో మధ్యలో చదువులను పిల్లలు మానేయకుండా వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు 18 సంవత్సరాల వయస్సులోపు ఉన్న పిల్లలు విద్యను పూర్తిచేసేందుకు వీలుగా, అన్బుకరంగళ్ పథకం ద్వారా నెలకు రూ. 2,000 స్కాలర్‌షిప్‌ను అందించనున్నారు. పాఠశాల, కళాశాల విద్య, వివిధ నైపుణ్యాల శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ పథకాన్ని సోమవారం కలైవానర్ అరంగంలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. అలాగే 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాల ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేయనున్నారు.
తిరుచ్చి సమీపంలో
దారుణం
తిరువొత్తియూరు: తిరుచ్చి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు.. చైన్నె వ్యాపారి కారు అద్దాలు పగలగొట్టి, కళ్లలో కారంచల్లి 10 కిలోల బంగారంను చోరీ చేసిన ఘటన సంచలనం కలిగించింది. వివరాలు.. చైన్నెలోని సౌకార్ పేటలో ప్రసిద్ధి చెందిన ఆర్.కె. జ్యువెలరీ ఉంది. వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగల దుకాణాలకు బంగారు ఆభరణాలను విక్రయిస్తారు. ఈ క్రమంలో ఆర్.కె. జ్యువెలరీ మేనేజర్ ప్రదీప్ షాట్ గత 8వ తేదీన చైన్నె నుంచి కిలోల కొద్దీ బంగారు ఆభరణాలను కారులో తీసుకుని దిండిగల్ వెళ్లారు. తరువాత అక్కడ కొన్ని దుకాణాలకు ఆభరణాలను విక్రయించి, మిగిలిన 10 కిలోల బంగారంతో శనివారం రాత్రి ముగ్గురు ఉద్యోగులతో చైన్నెకి తిరిగి వస్తున్నారు. తిరుచ్చి చైన్నె బైపాస్ రోడ్డులో సమయపురం సమీపంలోని కొణలై ప్రాంతంలో వారు మూత్ర విసర్జన కోసం కారును ఆపారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుర్తు తెలియని ముఠా వారిపై కారం చల్లి, కారు అద్దాలను పగలగొట్టి, అందులో ఉన్న 10 కిలోల బంగారాన్ని దోచుకుని పారిపోయారు. వెంటనే నగల దుకాణం మేనేజర్ సమయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. తరువాత 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కారును అడ్డగించి కారు అద్దాలను పగలగొట్టి 10 కిలోల బంగారు ఆభరణాలను చోరీ చేసిన సంఘటన తిరుచ్చి, చైన్నెలో తీవ్ర కలకలం రేపింది.
మురుగన్ సేవలో
తమిళిసై
తిరుత్తణి: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శనివారం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశ్విన్‌కుమార్ స్వాగతం పలికారు. ఆలయ అధికారులు స్వామి దర్శనంకు ఏర్పాట్లు చేశారు. మూలవర్లు, ఉత్సవమూర్తి, ఆపత్సహాయ వినాయకుడిని దర్శించుకున్న తమిళిసైకి ఆలయ అధికారులు ప్రసాదాలు వినిమయం చేశారు. అనంతరం ఆమె విలేకరుతలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ఘన విజయం తథ్యమన్నారు.

‘అన్బుకరంగళ్’