
ఢిల్లీకి.. పళణిస్వామి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందుకోసం తన ప్రజా చైతన్య యాత్రలో మార్పు చేసుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటూ బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వాళ్లు, బహిష్కరించ బడ్డ వాళ్లందర్నీ మళ్లీ ఏకం చేయాలని, సమష్టి సమన్వయంతో ముందుకెళ్దామని ఆ పార్టీ సీనియర్ నేత సెంగోట్టయన్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. దీంతో ఆయనపై పళణి స్వామి కన్నెర్ర చేశారు. ఆయన మద్దతు దారులందర్నీ తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు విస్తృతం చేశారు. పార్టీ పదవుల నుంచి తొలగించ బడ్డ సెంగోట్టయన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వచ్చారు. నెల రోజులలో అందరూ ఏకం కావడం తథ్యమన్న సంకేతాలను సెంగోట్టయన్ ఇస్తూ వస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం తలా ఓ మాట అంటూ వ్యాఖ్యల తూటాలను పేల్చుతూవస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పళణి స్వామిని ఇరకాటంలో పడేసే విధంగా మారి ఉన్నాయి. బహిష్కరించబడ్డ వారిని మళ్లీ అక్కున చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ వస్తున్న పళణిస్వామి హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం ప్రాధాన్యతకు దారి తీసింది.
రేపు హస్తినలో.. బిజీ
గోట్టయన్‌కు చెక్ పెట్టడం, బీజేపీ వర్గాల తలా ఓమాటలకు కల్లెం వేసే దిశగా పళణిస్వామి వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో పళణిస్వామిపై ఒత్తిడి తెచ్చి తలా ఓ దారిలో ఉన్న వారందర్నీ ఒక చోట చేర్చి అన్నాడీఎంకే ఐక్యంగా ఉండే దిశగా బీజేపీ పెద్దలు సైతం వ్యూహ రచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పళణి స్వామి ఢిఢిల్లీ వెళ్తుండడం గమనార్హం. తన ప్రజాచైతన్య యాత్రలో 17,18 తేదీలలో ఆయన ధర్మపురిలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటనలను ఈ నెల 28,29 తేదీలకు వాయిదా వేసుకున్నారు. ఈ రెండు రోజులు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. మంగళవారం యాత్రను ముగించుకుని ఢిల్లీకి వెళ్లే ఆయన మరుసటి రోజున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్టు తెలిసింది. ఈ భేటీల తదుపరి తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతి పదవి అధిరోహించిన నేపథ్యంలో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పళణి స్వామి ఢిల్లీ పర్యటనకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కొత్తగా ఆ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లిన ఇన్బదురైకు కేంద్రం విద్యా పరంగా ఓ నామినేటెడ్ పదవిని అప్పగించడం గమనార్హం.