
లోక్ అదాలత్‌తో 90,892 కేసులు పరిష్కారం
తిరువొత్తియూరు: దేశవ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో భాగంగా తమిళనాడులో 90,892 కేసులకు పరిష్కారం లభించింది. దీని ద్వారా బాధితులకు రూ. 718.74 కోట్లు లభించాయని తమిళనాడు రాష్ట్ర న్యాయ సేవల కమిటీ సభ్య కార్యదర్శి ఎస్. బాలకష్ణన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాలలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రతి 4 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ అనే ప్రజా న్యాయస్థానం నిర్వహిస్తున్న విషయం తలిసిందే. దాని ప్రకారం, దేశవ్యాప్తంగా శనివారం లోక్ అదాలత్ జరిగింది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎం. శ్రీవాస్తవ మార్గదర్శకత్వంలో, తమిళనాడు రాష్ట్ర న్యాయ సేవల కమిటీ ఛైర్మన్, సీనియర్ న్యాయమూర్తి ఎం. సుందర్ పర్యవేక్షణలో తమిళనాడులో లోక్ అదాలత్ జరిగింది.
501 బెంచ్‌ల ఏర్పాటు..
దీనికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర న్యాయ సేవల కమిటీ సభ్య కార్యదర్శి ఎస్. బాలకష్ణన్ మాట్లాడుతూ మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తులు పి.పి. బాలాజీ, కె. రాజశేఖర్, ఎన్. సెంథిల్. కుమార్, జి.అరుణ్మురుగన్, ఎం.జ్యోతిరామన్, మదురై హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి పి.పూర్ణిమ నేతత్వంలో జిల్లా స్థాయిలో, బెంచ్ న్యాయస్థానం, క్రిమినల్ కోర్టు న్యాయమూర్తుల నేతత్వంలో, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల నేతత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 501 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్‌లలో చెక్ మోసం కేసులు, సివిల్ కేసులు, ట్రాఫిక్, ప్రమాదాలు వంటి కేసులు విచారణకు స్వీకరించారు. కేసులో సంబంధిత ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి, వారి సమ్మతితో కేసులు పరిష్కరించారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 90,892 కేసులు పరిష్కరించబడ్డాయి. దీని ద్వారా బాధితులకు రూ.718.74 కోట్లు లభించాయి. ప్రజా న్యాయస్థానంలో ఎక్కువ కేసులను పరిష్కరించే విధంగా హైకోర్టు న్యాయమూర్తులు విల్లుపురం, కోయంబత్తూర్, తిరునల్వేలి, సమీప జిల్లాలలో న్యాయస్థానాలకు నేరుగా వెళ్లి పరిశీలించారు. కోయంబత్తూర్, తిరుప్పూర్ వంటి జిల్లాలలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎ.టి. జగదీశ్‌చంద్ర, విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై వంటి జిల్లాలలో హైకోర్టు న్యాయమూర్తి ఎం.దండపాణి, తూత్తుకుడి, తెన్కాసి, తిరునల్వేలి వంటి జిల్లాలలో హైకోర్టు న్యాయమూర్తి జి.కె. ఇళందరైయన్ పర్యవేక్షణలో లోక్ అదాలత్ నిర్వహించామని ఆయన తెలిపారు.