
చైన్నెలో కుండపోత
తిరువొత్తియూరు: ఉత్తర చైన్నె ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రెడ్‌హిల్స్, మాధవరం, దాని పరిసర ప్రాంతాలలో తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన వర్షం గంటకు పైగా కురిసింది. అదేవిధంగా మాధవరం, పుళల్, మూలక్కడై, కొడుంగయూర్, పెరంబూర్, వన్నారపేట, దాని పరిసర ప్రాంతాలలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. ఆదివారం కురిసిన వర్షం కారణంగా పెరంబూర్ వంతెన నుంచి ఓటెరీ వైపు వెళ్లే రహదారిపై నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చైన్నె నగరంలోని మధ్య ప్రాంతాలైన ఎగ్మోర్, పురసవాక్కం, వేప్పేరి, పెరియమేడు తదితర ప్రాంతాలలో తెల్లవారుజామున కుండపోత కురిసింది. దీంతో ఎగ్మోర్ చుట్టుపక్కల ప్రాంతాలు, లోతట్టు రోడ్లలో నీరు నిలిచిపోయింది. మీనంబాక్కం, ఎన్నూర్, నందనం, పశ్చిమ తాంబరం, చెంగల్పట్టు తదితర ప్రాంతాలూ జలమయం అయ్యాయి.
సాధారణం కంటే అధిక వర్షాలు : వాతావరణ శాఖ వెల్లడి
ఈ సంవత్సరం ఈశాన్య రుతుపవనాల వల్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుస తుపానులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కాలంలో సగటున 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, ఈ ఏడాది అది మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని ప్రకటించారు.