
త్వరలో మంచి నిర్ణయం
సాక్షి, చైన్నె: త్వరలో పొత్తు విషయంగానూ, పార్టీ పరంగాను మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తానని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. అలాగే అన్బుమణితో ఉన్న సమస్య కూడా పరిష్కారమైందని ప్రకటించారు. వివరాలు.. పీఎంకేలో అన్బుమణి, రాందాసు మధ్య అధికార సమరం సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య నేతలు, కేడర్ నలిగి పోయారు. వేర్వేరు శిబిరంగా కొనసాగుతూ వస్తున్నారు. అన్బుమణిని పార్టీ నుంచి సైతం రాందాసు తప్పించారు. ఈ పరిస్థితుల్లో హోసూరులో జరిగిన పార్టీ కార్యక్రమానికి ఆదివారం హాజరైన రాందాసు చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయంలో పడేశాయి. అన్బుమణితో తనకు ఉన్న సమస్య పరిష్కరించ బడ్డట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఇద్దరి మధ్య నిజంగానే వివాదం సమసినట్టేనా అన్న చర్చ బయలు దేరింది. అదే సమయంలో అన్బుమణిని పార్టీ నుంచి తప్పించిన నేపథ్యంలో సమస్య పరిష్కరించబడ్డట్టుగా రాందాసు వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక, పొత్తు విషయంగా త్వరలో నిర్ణయం ప్రకటిస్తామంటూ సీఎం స్టాలిన్‌ను పరోక్షంగా పొగడ్తల పన్నీరులో ముంచే విధంగా రాందాసు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక, ఈ సమావేశానికి వచ్చిన వారి కోసం వెయ్యి కేజీల మాంసంతో బ్రహ్మాండ బిర్యానీ విందును ఏర్పాటు చేశారు.