
మయూర వాహనంపై.. సుబ్రహ్మణేశ్వరుడి చిద్విలాసం
తిరుత్తణి: ఆవణి నెల కృత్తిక సందర్భంగా శుక్రవారం రాత్రి ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. వివరాలు..తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆవణి నెల కృత్తిక సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తిరుత్తణికి చేరుకున్నారు. చాలా మంది ఆడికృత్తిక సందర్భంగా కావళ్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఆవణి కృత్తిక సందర్భంగా కావళ్లు చెల్లించేందుకు కొండ ఆలయంకు పోటెత్తారు. మెట్ల మార్గంలో కొండకు భక్తులు చేరుకోగా, ఘాట్‌రోడ్డులో వాహనాల రద్దీ నె లకొంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం తెల్ల వారు వరకు భక్తజనంతో పాటూ హారంహర నామస్మరణ నెలకొంది. రాత్రి 8 గంటలకు శ్రీవళ్లి, దేవసేన సమేత ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి విశిష్ట పుష్పలంకరణలో వెండి నెమలి వాహనంలో కొలువుదీరారు. మాడ వీధుల్లో అశేష సంఖ్యలో గుమిగూడిన భక్తజనం నడుమ స్వామికి కర్పూర హారతుతో మాడ వీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకుని పరవశం చెందారు. ఉదయం నుంచి రాత్రి వరకు 70 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉచిత క్యూలైన్‌లో స్వామి దర్శనానికి 3 గంటల సమయం పట్టగా, రూ. 100 ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.