
కోలీవుడ్‌లో సత్తాచాటుతున్న యువ నటుడు
తమిళసినిమా: ఏ రంగంలోనైనా ప్రతిభే ప్రామాణికం. పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం కచ్చితంగా ఉంటుంది. అలా స్వయం కృషితో ఎదుగుతున్న యువ నటుడు సిద్ధార్ధ శంకర్. డాక్టర్ కావాలని యాక్టర్ అయిన నటుల్లో ఈయన ఒకరు. మలేషియాలో పుట్టి పెరిగిన తమిళ కుటుంబానికి చెందిన ఈయన డాక్టర్ విద్యను రెండేళ్లు చదివి ఆ తర్వాత నటనపై ఆసక్తి కలగడంతో వైద్య విద్యను మధ్యలోనే ఆపేసి నటుడుగా అవతారం ఎత్తారు. కోరిక తనకు కొంచెం ముందే కలిగితే యాక్టింగ్ డాన్సింగ్ ఫైటింగ్ రంగాలలో శిక్షణ తీసుకునే వాడినని అవేవీ లేకుండానే నటుడిగా మారినట్లు సిద్ధార్థ శంకర్ పేర్కొన్నారు. అయితే ఆ తరువాత నటుడు నాజర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందినట్లు చెప్పారు. ఆయన కళ్లతో చక్కని హావభావాలు పలికించగలనని తనను ప్రశంచించారన్నారు. అలా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన సైతాన్ చిత్రంతో తాను నటుడిగా పరిచయం అయినట్లు చెప్పారు. మలేష్ యాదవ్ ఒక మిత్రుడి ద్వారా విజయ్ అంటోని పరిచయమయ్యారని, ఆ తర్వాత తామిద్దరం తరసు జిమ్‌లో కలుసుకునేవారమని చెప్పారు. అప్పుడు ఆయన్ని అవకాశాల కోసం అడిగే వాడినని అలా సైతాన్ చిత్రంలో కీలకపాత్రను పోషించే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. ఆ తర్వాత కొలై, గడారం కొండాన్, ఐంగరన్,నిలావుక్కు ౠన్ మేల్ ఎన్నడీ కోపం,మదరాసి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న మంచి కథ పాత్రల్లో నటించినట్లు చెప్పారు. అదేవిధంగా హిందీలో పరం సుందరి చిత్రంలో నటి జాన్వీ కపూర్‌కు జంటగా నటించినట్లు చెప్పారు. గుడారం కొండాన్ చిత్రం షూటింగ్ సమయంలో విక్రమ్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు తాను చిన్నతనం నుంచి అభిమానినని, మదరాసి చిత్రాల్లో శివకార్తికేయన్, విద్యుత్ జమ్వాల్, బిజీ మీనన్, రుక్మిణి వసంత్ వంటి స్టార్స్‌తో నటించడం మంచి అనుభవమని, వారినుంచి చిన్న చిన్న విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. హీరోగా అవకాశాలు వేస్తే నటించడానికి రెడీ అన్నారు. తెలుగు వంటి ఇతర భాషల్లోనూ నటించాలని ఉందనే ఆకాంక్షను సిద్ధార్థ శంకర్ వ్యక్తం చేశారు.