
క్లుప్తంగా
అత్తిమాంజేరిపేటలో
జాతర సందడి
పళ్లిపట్టు: అత్తిమాంజేరిపేటలో ఐదురోజుల గంగమ్మ జాతర శనివారం వేడుకగా ముగిసింది. అత్తిమాంజేరిపేటలో గంగమ్మ జాతరను శనివారం కోలాహలంగా నిర్వహించారు. జాతరలో భాగంగా శుక్రవారం నెల్లికుండ్రం, శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంగీత విభావరి, మనస్సుకు నచ్చిన పాటలు, ఆధ్యాత్మికత నిండిన పాటలకు సంబంధించి నిర్వహించిన పాటల పోటీలు గ్రామీణులను అమితంగా ఆకట్టుకున్నాయి. జాతరను గ్రామీ ణులకు వినోదాన్ని ఆస్వాదించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్లు కదిరవన్, రామచంద్రన్, నెల్లికుండ్రం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శరవణన్, కార్యదర్శి కోవలన్, కోశాధికారి భూపతి, పారిశ్రామికవేత్త దేవరాజ్ ఘనంగా సత్కరించారు.
మహిళకు లైంగిక వేధింపులు
– యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: వేళచ్చేరిలో మహిళ స్నానం చేస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చైన్నెలోని వేలచ్చేరి ప్రాంతంలో 35 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తన ఆడపిల్లతో కలిసి ఇంట్లోని బాత్రూంలో స్నానం చేస్తుండగా, పక్క ఇంట్లో నివసిస్తున్న ఎడ్విన్ అనే యువకుడు ఆమె స్నానం చేస్తుండగా తొంగిచూసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై బాధితురాలు వేలచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఎడ్విన్‌ను అరెస్టు చేశారు.
ఆమ్నీ బస్సు స్వాధీనం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్ పేటలోని ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఆర్టీఓ చెక్‌పోస్టు ఉంది. ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తుంటారు. ఈక్రమంలో శనివారం ఉదయం ఎంవీఐ సుమేష్ ఆధ్వర్యంలో చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహంచారు. ఆ సమయంలో ఆంధ్రా నుంచి నుంచి వచ్చిన ఆమ్నీ బస్సు పత్రాలను తనఖీ చేశారు. రిజిస్టర్‌లోని నంబర్, ఆమీ బస్సు నంబర్ వేర్వేరుగా కనిపించాయి. రిజిస్టర్ నంబర్‌ను పరిశీలించగా అది మహారాష్ట్ర నంబర్‌గా తేలింది. ఆంధ్ర, విజయవాడకు చెందిన ఒకరు బస్సును కొనుగోలు చేసి నకిలీ తమిళనాడు నంబర్ స్టిక్కర్ అతికించి తిరువణ్ణామలైకి ప్రయాణికులకు తీసుకొస్తున్నట్లు తెలిసింది. నకిలీ రిజిస్ట్రేషన్‌తో వచ్చిన ఆమ్నీ బస్సును స్వాధీనం చేసుకొని ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు.
కార్మికుల ఆందోళన
తిరువొత్తియూరు: తిరువొత్తియూరు టైర్ ఫ్యాక్టరీ వద్ద 2వ రోజు కూడా కార్మికుల నిరసన, ప్రవేశ ద్వారం వద్ద నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు..తిరువొత్తియూరు విమ్కో నగర్‌లోని ఓ ప్రైవేట్ టైర్ ఫ్యాక్టరీలో సుమారు 850 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వైద్య బీమా పథకానికి డబ్బు ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించడంతో కార్మికులు సమ్మె చేపట్టారు దీనితో, యాజమాన్యం కార్మికులను కంపెనీకి తీసుకురావడానికి, వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసిన బస్సు, క్యాంటీన్ వంటి ప్రాథమిక సౌకర్యాలను నిలిపివేసింది. దీంతో కార్మికులు శుక్రవారం నిరసన తెలిపారు. దానిని కొనసాగిస్తూ, శనివారం ఉదయం కార్మికులు పనికి వచ్చినప్పుడు ఫ్యాక్టరీ గేటు తెరవలేదు. దీనిని ఖండిస్తూ, కార్మికులు 2వ రోజు ప్రవేశ ద్వారం వద్ద కూర్చుని నిరసన నినాదాలు చేశారు. యాజమాన్యం గేటు తెరవాలి.. వైద్య బీమా నిధిని అందించాలి.. అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. కాగా ఈ విషయంపై కార్మిక సంఘం, పోలీసులు కలిసి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు.
టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం
తిరుమల: తమిళనాడు రాష్ట్ర మంత్రి కెఎన్ నెహ్రూ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు శనివారం విరాళంగా అందించారు. నవంబర్ 9న తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నప్రసాదం వితరణకు అయ్యే ఖర్చు రూ 44 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన ప్రతినిధి సురేష్ శనివారం తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

క్లుప్తంగా

క్లుప్తంగా