
పార్క్ స్థలం ఆక్రమణపై కౌన్సిల్‌లో ఫిర్యాదు
తిరువళ్లూరు: పార్క్ స్థలం అక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ థామస్ డిమాండ్ చేయగా, ఆక్రమణలపై ప్రశ్నించవద్దని పిర్యాదు చేసిన కౌన్సిలర్‌కు లంచం ఎరచూపిన వ్యవహరంపై ఆడియో ప్లే చేయడంతో కలకలం రేపింది. తిరువళ్లూరు మున్సిపాలిటి సమావేశం చైర్‌పర్సన్ ఉదయమలర్ పాండ్యన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ దామోదరన్, వైస్ చైర్‌పర్సన్ రవిచంద్రన్‌తో పాటూ అన్ని శాఖలకు చెందిన అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్‌లు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే రోడ్లు, తాగునీటి సదుపాయం, సబ్‌వే మురుగునీటి స్టోరేజ్ కేంద్రం నుంచి నీరు బయటకు వెళ్లడానికి పైపుల అమరిక లాంటి సమస్యలపై చర్చించారు. అనంతరం కౌన్సిలర్ థామస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన విలువైన పార్క్ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని విక్రయించారు. పార్క్ స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి మున్సిపల్ అధికారులే అనుమతి ఇచ్చి భారీగా లబ్ధిపొందారు. ఈ విషయంపై గత మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రశ్న లేవనెత్తితే వారిపై చర్యలు తీసుకోకుండా కొందరు అధికారులు తన వద్దకు స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తిని రాయబారానికి పంపారు. ఇకపై పార్క్ స్థలం ఆక్రమణపై నోరు మొదపవద్దని తననూ ఫోన్‌లో కోరడంతో పాటూ భారీగా లంచం ఆశచూపారని వివరించారు. అయితే థామస్ లేవనెత్తిన ఆరోపణలపై కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాము ఎవ్వరిని రాయభారానికి పంపలేదని, కౌన్సిలర్ చేసిన పిర్యాదుపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో మళ్లీ కౌన్సిలర్ లేచినిలబడి తాను చేసిన ఆరోపణలు అవాస్తమని కమిషనర్ సమాధానమిచ్చారు. కానీ నాతో మాట్లాడిన ఆడియో ఉందంటూ కౌన్సిల్ సమావేశంలో ఆడియోనూ ప్లేచేయడంతో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. విషయంపై జోక్యం చేసుకున్న చైర్‌పర్సన్, త్వరలోనే పార్క్ స్థలం ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో శానిటరీ అధికారి మోహన్ కౌన్సిలర్లు అరుణ, సుమిత్ర పాల్గొన్నారు.