
యాన్ ఆర్డినరీ మెన్ ప్రోమో విడుదల
తమిళసినిమా: ఛార్మింగ్ కథానాయకుడు రవి మోహన్ ఇప్పుడు అనేక అవతారాలు ఎత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి చిత్రం ద్వారా ప్రతి నాయకుడిగా అవతారమెత్తారు. ఈ చిత్రం విడుదలకు ముందే రవి మోహన్ స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఒకేసారి దర్శక నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవల చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో భారీ స్థాయిలో నిర్వహించారు. ఆ వేదికపై తాను సంస్థలో నిర్మించే మూడు చిత్రాల వివరాలను వెల్లడించారు. అందులో ఒకటి రవి మోహన్ మెగాఫోన్ పట్టే చిత్రం. నటుడు యోగిబాబు హీరోగా రవి మోహన్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యాన్ ఆర్డినరీ మెన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి జాయ్ సరోలా ఛాయాగ్రహణం, హైడ్రో సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా రవి మోహన్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం యాన్ ఆర్డినరీ మెన్ చిత్రం ప్రోమోను విడుదల చేశారు. నటుడు యోగిబాబు పాత్రను పరిచయం చేసే ఈ ప్రోమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ చిత్రంతో పాటు రవి మోహన్ తన సంస్థలో రూపొందనున్న బ్రోకోడ్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటితో పాటూ మరో చిత్రాన్ని రవి మోహన్ స్టూడియోస్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.