
96 చిత్ర దర్శకుడితో ఫహద్ ఫాజిల్
తమిళసినిమా: కొన్ని రేర్ కాంబినేషన్ చిత్రాలు అనూహ్యంగా సెట్ అవుతుంటాయి. 96 చిత్రంతో మెగా ఫోన్ పట్టి కెమెరామన్ ప్రేమ్ కుమార్ ఆ చిత్రంతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా నటి త్రిషకి రీ ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఆ తరువాత కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించిన మెయ్యళగన్ చిత్రం చేసి ప్రేమ్ కుమార్ మరో సక్సెస్ సాధించారు. ఇలా చాలా జాగ్రత్తగా చిత్రాలు చేస్తున్న ప్రేమ్ కుమార్‌తో చిత్రాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారనే చెప్పాలి. తాజాగా నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా ప్రేమ్ కుమార్ ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈయనకు ఇటీవల ఫహద్ ఫాజిల్‌ను కలిసి 45 నిమిషాల పాటు కథను చెప్పినట్లు, అది ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో తమిళంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా నటుడు ఫహత్ ఫాజిల్ ఇటీవల వడివేలుతో కలిసి నటించిన మారీశన్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.