
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
కొరుక్కుపేట: ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యమని ఆరోగ్యశాఖా మంత్రి ఎం.సుబ్రమణియన్ అన్నారు. తమిళనాడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం తరఫున బుధవారం చైన్నెలోని కలైవానర్ అరంగంలో హెచ్‌ఐవీ ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన ప్రచారం జరిగింది. మంత్రి సుబ్రమణియన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సెంథిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ మహేష్‌కుమార్, వైద్యవిద్య డైరెక్టర్ సుగంధి రాజకుమారి, ప్రజారోగ్య డైరెక్టర్ సోమసుందరం పాల్గొని మాట్లాడారు. మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ హెచ్‌ఐవి, ఎయిడ్స్ గురించి అవగాహన పెంచుతామని ప్రతిజ్ఞ చేసి ప్రత్యేక ప్రసంగం చేశారు. 7,877 మంది పిల్లలకు పోషకాహారం, విద్య సాయం కోసం నెలకు రూ.1000 అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు, రూ.2 కోట్ల 23 లక్షలు అందించామని చెప్పారు. 2030 నాటికి, కొత్త హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజాన్ని సృష్టించే లక్ష్యంతో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నేటి నుంచి ఎటువంటి రుసుము లేకుండా ఉచిత హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ,ఇతర లైంగిక సంక్రమణ వ్యాధులకు చికిత్స, పరీక్షలను అందించడానికి నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి మంజూరు చేశామని చెప్పారు. దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి 0.23 శాతం, తమిళనాడులో ఇది 0.16 శాతానికి తగ్గిందని, భవిష్యత్తులో తమిళనాడు హెచ్‌ఐవీ ఎయిడ్స్ లేని రాష్ట్రంగా మారాలని పేర్కొన్నారు. తమిళనాడులో లక్షా 37 వేల కొత్త హెచ్‌ఐవీ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. కార్యక్రమాన్ని ఎయిడ్స్ మ్యూజిక్ అసోసియేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ తమిళ్‌సెల్వన్ నిర్వహించారు.
హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య తగ్గుముఖం
వేలూరు: అవగాహనతోనే జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధితులు పూర్తిగా తగ్గారని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు అధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో మానవ హారం, పాఠశాల విద్యార్థులకు మారథాన్ పోటీలు బుధవారం ఉదయం నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ నుంచి వేలూరు నేతాజీ స్టేడియం వరకు జరిగిన మారథాన్ అవగాహన పోటీలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను సాటి మానవులుగా చూడాలన్నారు. సమాజం నుంచి వారిని బహిష్కరించడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన మందులను సరఫరా చేస్తుందన్నారు. వేలూరు జిల్లాలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. గతంలో జిల్లాలో ఐదు శాతం బాధితులుండగా ప్రస్తుతం వాటి శాతం పూర్తిగా లేనట్లు సర్వేలు చెపుతున్నాయన్నారు. జిల్లాలో ఎయిడ్స్ భాదితులు లేకుండా చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. మనకు తెలియకుండా ఈ వ్యాధి శోకే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ రక్త పరిశోధనలు చేసుకోవడం మంచిదన్నారు. ఎయిడ్స్ బాధితులను కాపాడేందుకు పలు పరిశోధనలు చేస్తున్నారని అందులో భాగంగా పలు టీకాలను కనిపెట్ట వచ్చునన్నారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలో రోడ్డులో మానవహారంగా నిలిచి ప్రతిజ్ఞ చేశారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహణ కల్పించేందుకు నర్సింగ్ సిబ్బంది వద్ద అవగాహన కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ సుజాత, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి భరణీధరన్, ఎయిడ్స్ కంట్రోల్ విభాగం రీజినల్ మేనేజర్ కీర్తిక, జిల్లా స్పోర్ట్స్ అధికారి సుబ్రమణియన్, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం