
బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద మృతి
తిరువళ్లూరు: బ్యాంకు మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలు మప్పేడులోని బ్యాంకును ముట్టడించి ఆందోళన చేశారు. తిరువళ్లూరు జిల్లా కూవం గ్రామానికి చెందిన దప(35). ఈమె మప్పేడు ఇండియన్ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఈమె ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వడం, స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళల నగదును బ్యాంకులో జమ చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఈనెల 14న ఈమెకు వివాహం జరగనున్న క్రమంలో మంగళవారం సాయంత్రం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే దీప స్వయం ఉపాధి సంఘాలకు చెందిన నగదు, ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన నగదు రూ.కోటి మేరకు మోసానికి పాల్పడిందని తెలిసింది. దీప మృతి చెందిన క్రమంలో స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలు, ఉపాధి కూలీలు మప్పేడులోని ఇండియన్ బ్యాంకును బుధవారం ఉదయం ముట్టడించారు. పలు మహిళా స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళల పేరిట భారీగా రుణాలను దీప తీసుకున్నట్టు నిర్ధారించారు. ఈ నగదును సంబంధిత మహిళలే చెల్లించాలని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. తమ ప్రమేయం లేకుండా రుణాలను ఎలా ఇస్తారని బ్యాంకు అధికారులను మహిళలు నిలదీశారు. విషయం తెలుసుకున్న బ్యాంకు ఉన్నతా ధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో స్వయం ఉపాధి సంఘాలకు చెందిన లావాదేవీలు, రుణాలు పొందిన వివరాలు, ఉపాధి కూలీల వేతనాలపై స్టేట్‌మెంట్ తీసి విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. దీప మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద మృతి