
‘సీమాన్’ కసరత్తు
సాక్షి, చైన్నె: లోక్‌సభ ఎన్నికలలో తన కంటూ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని మరోమారు నిరూపించుకున్న నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మరింత బలాన్ని చాటే దిశగా కసరత్తులలో పడ్డారు. 130 మందితో అభ్యర్థుల జాబితాను ఆయన సిద్ధం చేసి ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. వీరంతా 30 ఏళ్లలోపు యువతీ, యువకులే అని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు.. పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ప్రతి ఎన్నికలలోనూ సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా పోటీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. క్రమంగా ఆ పార్టీ తన ఓటు బ్యాంక్‌ను పెంచుకుంటూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో అయితే, ఆ పార్టీ ఓటు బ్యాంక్ మీద ప్రభావం పడే విధంగా వ్యూహాలు, కుట్రలు జరిగాయి. ఆది నుంచి ఆపార్టీ పోటీ చేస్తూ వచ్చిన చెరుకు రైతు చిహ్నం లోక్‌సభ ఎన్నికలలో దూరం చేశారు. అయినా ఏ మాత్రం తగ్గని సీమాన్ మైక్ చిహ్నం చేతికి అంది పుచ్చుకుని ఒంటరిగా పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టారు. ఇందులో 20 మంది మహిళలను నిలబెట్టి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచా రంలో సీమాన్ ఉరకలు తీశారు. ఇందుకు తగిన ఫలితం ఓటు బ్యాంక్ ద్వారా దక్కించుకున్నారు.
ఈసీ గుర్తింపు సైతం..
అంతేకాదు, ఎన్నికల కమిషన్ గుర్తింపును సైతం సీమాన్ పార్టీ దక్కించుకుంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం 35 వేల నుంచి 80 వేల మధ్య ఓట్లను ఆ పార్టీ సాధించడం విశేషం. అలాగే, బీజేపీ, అన్నాడీఎంకే కూటముల అభ్యర్థులకు చుక్కలు చూపించే రీతిలో 7 నియోజకవర్గాలలో మూడో స్థానాన్ని కై వసం చేసుకునే విధంగా నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు అధిక ఓట్లను సాధించారు. ఇదే ఊపుతో 2026 అసెంబ్లీ ఎన్నికలలో బలాన్ని మరింతగా చాటే దిశగా సీమాన్ వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకోసం ముందుగానే అభ్యర్థుల ఎంపిక కసరత్తులలో నిమగ్నమై ఉన్నారు. యువతీ, యువకులను ఈ సారి పెద్ద సంఖ్యలో ఎన్నికల బరిలో నిలబెట్టే విధంగా జాబితా కసరత్తులు జరుగుతున్న ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 130 నియోజకవర్గాలకు అభ్యర్థులను సీమాన్ ఖరారుచేసినట్టు, ఇందులో 30 ఏళ్లలలోపు యువతీ, యువకులు అధికంగా ఉన్నట్టు ఓ నేత పేర్కొనడం గమనార్హం. ఈ జాబితాలో 65 మంది యువకులు, 65 మంది యువతులు ఉండడం గమనార్హం. మిగిలిన నియోజకవర్గాలకు స్థానికంగాపార్టీకి ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న మేధావులు, విద్యావంతులను నిలబెట్టే వ్యూహంతో కసరత్తుల వేగాన్ని సీమాన్ పెంచి ఉన్నారు. ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ప్రజలల్లోకిప్రచార పర్యటనకు సైతం ఆయన రూట్ మ్యాప్ స్వయంగా రూపొందించుకుంటుండడం గమనార్హం.