
గీత కార్మికుడి ప్రశ్నలతో పళణికి ఇరకాటం
సాక్షి, చైన్నె : గీత కార్మికుడి రూపంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి ఇరకాటంలో పడ్డారు. ఆ కార్మికుడు ప్రశ్నల వర్షం కురిపించడంతో పళణి స్వామిలో ఆగ్రహం కనిపించింది. వివరాలు.. తమిళనాడు, తమిళ ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళణిస్వామి ప్రజా చైతన్య యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో విడత యాత్ర బుధవారం కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిధిలోకి చేరింది. ఇక్కడి రైతులతో పళణిస్వామి ప్రత్యేక సమావేశానికి నిర్ణయించారు. ఇక్కడ కొబ్బరి రైతులు మరీ ఎక్కువగానే ఉన్నారు. అన్ని వర్గాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అందరి సమస్యలను పళణి స్వామి ఆలకించారు. ఈ సమయంలో ఓ కల్లుగీత కార్మికుడు పళణిస్వామిని ఇరకాటంలో పడేస్తూ ప్రశ్నలను సంధించాడు. కల్లు గీతకు నిషేధం విధించి దశాబ్దాలు కావస్తోందన్నారు. ఇది వరకు అధికారంలో ఉన్నప్పుడు తమరెందుకు కల్లుగీతకు అనుమతి ఇవ్వలేదో స్పష్టం చేయాలని నిలదీశాడు. దీంతో పళణి స్వామి ఇరకాటంలో పడ్డాడు. వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోనని, 8 కోట్ల మంది ప్రజల సమస్యలు ఉన్నాయని దాట వేసే పనిలో పడ్డారు. అయితే, ఆ గీతకార్మికుడు పట్టువదలని విక్రమార్కుడి వలే ప్రశ్నలను ఎక్కుబెట్టడంతో పళణికి ఆగ్రహం వచ్చేసింది. సమస్యలు వినేందుకు తాను ఇక్కడకు వచ్చానని, సమస్యలు ఉంటే తెలియజేయాలని, అర్థం చేసుకోవాలని సున్నితంగా మందలించారు. అయినా, ఆ గీత కార్మికుడు తగ్గక పోవడంతో పక్కనే ఉన్న సీనియర్ నేత ఎస్పీ వేలుమణి, పొల్లాచ్చి విజయరామన్ ఆ కార్మికుడికి నచ్చ చెప్పే విధంగా వ్యాఖ్యల తూటాలను పేల్చక తప్పలేదు. అదే సమయంలో పలువురు రైతులు సైతం ప్రశ్నల తూటాలను పేల్చడంతో సమావేశంలో గందరగోళం, ఉత్కంఠ తప్పలేదు. కాగా ఈ సమావేశానంతరం పళణిస్వామి మాట్లాడుతూ, 2026 ఎన్నికలతో రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమ గీతం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.