
నయనతారను వెంటాడుతున్న కోర్టు కేసులు
తమిళసినిమా: పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ముఖ్యంగా దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న ఈ భామ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలు కూడా కలిగారు. కాగా ఆ మధ్య నయనతార ప్రేమ, పెళ్లి అంశాలతో కూడిన తన చిన్న బయోపిక్‌ను నయనతార బియాండ్ ది ఫెరీ టేల్ పేరుతో డాక్కుమెంటరిని రూపొందించారు. దీన్ని నెట్ ఫ్లిక్ ఓటీటీ సంస్థ భారీ మొత్తం చెల్లించి స్ట్రీమింగ్ హక్కులను పొంది ప్రసారం చేసింది. అక్కడి వరకూ బాగానే ఉన్నా, ఆ డాక్యుమెంటరీ చిత్రంలో నటుడు ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఆయన అనుమతి లేకుండా పొందుపరినందుకు ధనుష్ రూ. 10 కోట్లు చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో ఉండగానే తాజాగా అదే డాక్కుమెంటరిలో చంద్రముఖి చిత్రంలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా పొందుపరిచారంటూ ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ అధినేతలు చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తమ చిత్రంలోని సన్నివేశాలను తమ అనుమతి పొందకుండా నయనతారకు చెందిన డాక్కుమెంటరీలో పందుపరిచారని, అందుకు గానూ నష్టపరిహారంగా రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తి సెంథిల్ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతున్నట్లు డార్క్ స్టూడియోస్ సంస్థ తరపున హాజరైన న్యాయవాది పేర్కొన్నారు.అయితే ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలు జరపలేదని సిటీషన్ దారుడి తరపు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో రిట్ పిటీషన్ దాఖలు చేయాలని డార్క్ స్టూడియోస్ సంస్థకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి అక్టోబర్ 2లో విచారణ జరుపుతామంటూ పేర్కొన్నారు. దీంతో నయనతార ధనుష్ పిటిషన్‌తో పాటూ ఇప్పుడు ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ పిటిషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.