
పోరాటంతో దక్కిన న్యాయం
సాక్షి, చైన్నె: నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత కుటుంబ పెన్షన్‌ను ఓ సిఫాయి కుటుంబం దక్కించుకుంది. భారత సైన్యంలో విల్లుపురం జిల్లా సెంజికి చెందిన కె. దురైస్వామి 1971లో సిపాయిగా పనిచేశారు. ఎడమ కాలుకు గాయం కావడంతో 1975లో సైన్యంలో కొనసాగ లేక పోయారు. ఆయనకు వైకల్య పెన్షన్ అందుతూ వచ్చింది. 2021లో దురైస్వామి మరణించాడు. ఆర్మీ నుంచి వచ్చినానంతరం పూంగోదైను దురై స్వామి వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె పేరును సర్వీసు రికార్డులలో చేర్చలేదు. దీంతో కుటుంబ పెన్షన్ చెల్లించ లేని పరిస్థితి ఏర్పడింది. 2021 కోవిడ్ కాలం కావడంతో ఏమి చేయలేని పరిస్థితిలో అధికారులు సైతం పడ్డారు. ఆ తదుపరి పూంగోదై పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ఆర్మీలోని సంబంధిత విభాగం అధికారుల చుట్టూ తిరిగింది. చివరకు పీసీడీఏ(పెన్షన్లు)విభాగం అధికారి ప్రయాగ్ రాజ్‌ను కలిసి విన్నవించారు. ఆమె కష్టాలను విన్న అధికారి ప్రయాగ్ రాజ్ ఈ ఏడాది జూన్‌లో పూంగోదైకు అనుకూలంగా కుటుంబ పెన్షన్ చెల్లింపునకు ఆదేశాలు ఇచ్చారు. పూంగోదై, ఆమె కుమారుడు జయకుమార్ నాలుగు సంవత్సరాల పాటుగా చేసిన పోరాటానికి ప్రస్తుతం న్యాయం దక్కింది. పూంగోదైకు నెలకు రూ. 13,950 కుటుంబ పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే, దురైస్వామి మరణం తర్వాత నుంచి ఉన్న బకాయిగా కుటుంబ పెన్షన్‌కు గాను రూ. 4,64,408కు గాను చెక్కను అధికారులు అందజేశారు. ఈ చెక్కును పూంగోదై తరపున ఆమె కుమారుడు అధికారుల నుంచి అందుకున్నారు.