
ప్రజల్లోకి విజయ్
సాక్షి, చైన్నె: ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టేందుకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు,సినీ నటుడు విజయ్ సిద్ధమయ్యారు. నాలుగు నెలల పాటూ ప్రజల్లో తాను ఒక్కడ్నే అన్నట్టుగా మెలిగే రీతిలో పర్యటన రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఈనెల 13 నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు జరిగే విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో మంగళవారం టీవీకే నేతలు విజ్ఞప్తి చేశారు. వివరాలు.. తమిళగ వెట్రికళగంతో గత ఏడాది రాజకీయాలలోకి వచ్చిన విజయ్ ఈ ఏడాది తన కార్యాచరణను విస్తృతం చేసుకున్నారు. పార్టీ తరపున రెండు మహానాడులను జయప్రదం చేశారు. గత నెల మదురైలో జరిగిన మహానాడులో ప్రజలలోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితులలో తన ప్రచార పర్యటన ఇతర పార్టీల నేతల తరహాలో కాకుండా భిన్నంగా నిర్వహించేందుకు విజయ్ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. తన పర్యటనకు మీట్ ది పీపుల్ అన్న ట్యాగ్‌ను తగిలించారు. బహిరంగ సభలు,రోడ్ షోల రూపంలో ఉరకలు తీసే రీతిలో పర్యటనలకు తమిళగ వెట్రికళగం వర్గాలు షెడ్యూల్‌ను రూపొందించాయి. ఈ షెడ్యూల్‌ను డీజీపీ కార్యాలయంలో సమర్పించారు. విజయ్ రెండు మూడు సార్లు బయటకు వచ్చిన సందర్భంలోనే వేలాదిగా అభిమాన లోకం దూసుకొచ్చిన దృష్ట్యా, ఈసారి భద్రతను కోరుతూ ముందుగా చర్యలు చేపట్టారు.
13 నుంచి డిసెంబర్ 20 వరకు బహిరంగ సభలు
ఈనెల 13వ తేదీన తిరుచ్చిలో విజయ్ పర్యటన ప్రారంభం కానుంది. డిసెంబరు 20వ తేదీ వరకు ఆయన ప్రజలలోనే ఉండబోతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ తరపున టీవీకే వర్గాలు డీజీపీ కార్యాలయంలో షెడ్యూల్ వివరాలతో జాబితాను సమర్పించి భద్రత కల్పించాలని కోరారు. అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. విజయ్ పర్యటన అత్యధికంగా బహిరంగ సభల రూపంలోనే ఉండడం గమనార్హం. ఈనెల 13వ తేదీన తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరులలో పర్యటించనున్నారు. 20వ తేదీన నాగపట్నం, తిరువారూర్, మైలాడుతురై, 27వ తేదీన తిరువళ్లూరు, చైన్నె ఉత్తరం, అక్టోబరు 4,5 తేదీలలో కోయంబత్తూరు, నీలగిరి, తిరుప్పూర్, ఈరోడ్, 11వ తేదీన కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, 18వ తేదీన కాంచీపురం, వేలూరు, రాణిపేట, 25వ తేదీన చైన్నె దక్షిణం, చెంగల్పట్టు, నవంబర్ 1న కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, 8వ తేదీన కళ్లకురిచ్చి, విల్లుపురం, తిరువణ్ణామలై , 15వ తేదీన తెన్‌కాశి, విరుదునగర్, 22వ తేదీన కడలూరు, 29న శివగంగై, రామనాధపురం, డిసెంబరు6న తంజావూరు,పుదుకోట్టై, 13న నామక్కల్, కరూర్, సేలం, 20వ తేదీన దిండుగల్, తేని, మదురై, బహిరంగ సభలు జరగనున్నాయి.
వీక్ ఎండ్ షో..
వారంతంలో సినిమాలు విడుదలయ్యేట్టుగానే విజయ్ సైతం తన పర్యటనలను వారాంతంలో పెట్టుకోవడం గమనార్హం. నాలుగు నెలలు కాలం నెట్టుకు వచ్చే దిశగా ఈ బహిరంగ సభలకు సిద్ధమైనట్టుగా ఉంది. ఈనెల 13 నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు విజయ్ బహిరంగ సభలు ప్రతి శనివారం జరగనున్నడం గమనార్హం. అక్టోబరు 4,5 తేదీలలో మాత్రం శని, ఆదివారం ప్రజల ముందుకు రానున్నారు. ఈ పర్యటన వీక్ ఎండ్ షో అంటూ విమర్శలు గుప్పించే వాళ్లు కూడా ఉండటం గమనార్హం. అదేసమయంలో పర్యటన అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్న తమ వాళ్లపై పోలీసులు అక్రమ కేసులుపెడుతుండడాన్ని విజయ్ తీవ్రంగా ఖండించే పనిలోపడ్డారు.