
జిల్లాల పర్యటనకు ‘ఉదయ’ శ్రీకారం
సాక్షి, చైన్నె: డీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ జిల్లాల పర్యటనకు మంగళవారం శ్రీకారం చుట్టారు. కాంచీపురం నుంచి తన ప్రచార అధికారిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమంలో రూ.12.45 కోట్లతో పూర్తి చేసిన 9 ప్రాజెక్టులను, రూ.25.27 కోట్ల అంచనాతో కొత్తగా చేపట్టనున్న మరో 13 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ. 215 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను 4,997 మంది లబ్ధిదారులకు అందజేశారు. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ వివాహ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రులు శ్రీ ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం, ఆర్. గాంధీ, శాసనసభ సభ్యులు కె. సుందర్, సీవీఎంపీ ఎళిలరసన్, జిల్లా కలెక్టర్ కళైచెల్వి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో సాగుతున్న ప్రగతి, సంక్షేమ పథకాల గురించి చర్చించారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ వర్గాలు, యువజన నేతలతో భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, లబ్దిదారులకు అన్ని పథకాలు చేరే విధంగా అధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలని నేతలను ఉదయ నిధి ఆదేశించారు. ఇక, రోజుకో జిల్లాలో ఉదయ నిధి పర్యటన జరగనుంది.