
డీఎస్పీ విడుదల
సాక్షి, చైన్నె: కాంచీపురం శాంతి భద్రతల విభాగం డీఎస్పీ శంకర్ గణేష్‌ను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో కాంచీపురం కోర్టు చర్యలు విమర్శలకు దారి తీసినట్లయ్యింది. వివరాలు. కాంచీపురంలోని ఓ బేకరిలో జరిగిన గొడవకి సంబంధించి డీఎస్పీ శంకర్ గణేషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. సాయంత్రం జరిగిన వాదనల అనంతరం డీఎస్పీని అరెస్టు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కోర్టు పోలీసులు యూనిఫాంతో ఉన్న ఆయన్ని అరెస్టుచేశారు. అయితే, బయటకు రాగానే ఇతరపోలీసుల సాయంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. అయితే తాను తప్పించుకుని వెళ్ల లేదంటూ జైలులో లొంగి పోయారు. ఈ పరిస్థితులలో కాంచీపురం కోర్టు చర్యలు విమర్శలకు దారి తీశాయి. వ్యక్తిగత వ్యవహారం ఈ కేసులో ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం ద్వారా అప్పీలు పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. వాదనల సమయంలో కాంచీపురం జిల్లా కోర్టు న్యాయమూర్తి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు, చట్టాన్ని ఉల్లంఘించినట్టు, కేవలం ఈ వ్యవహారంలో వ్యక్తిగత విభేదాలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు న్యాయమూర్తి సతీష్‌కుమార్ బెంచ్ డీఎస్పీని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.