
కలెక్టర్‌కు వ్యతిరేకంగా వీఏఓల నిరసన
తిరువళ్లూరు: అనుమతి లేకుండా చేస్తున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్న వీఏఓను వీఆర్‌కు పంపడాన్ని నిరసిస్తూ తమిళనాడు గ్రామ నిర్వాహణ అధికారుల సంఘం ఆధ్వర్యంలో వీఏఓలు తాహశీల్దార్ కార్యాలయంలో నేలపై కూర్చుని నిరసనకు దిగారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొప్పూరు వీఏఓగా విశ్వనాథన్(45) విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6న కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో ప్రవేటు సంస్థ మట్టి తవ్వకాలను కొప్పూరు చెరువులో చేపట్టింది. అయితే సరైన అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న వీఏఓ అక్కడికి వెళ్లి మట్టి తవ్వకాలకు సంబంధించిన ఉత్తర్వులను చూపాలని కోరారు. అయితే మట్టి తవ్వకాలు చేస్తున్న ప్రవేటు సంస్థ కలెక్టర్ మౌఖిక ఆదేశాలతోనే తాము తవ్వకాలు చేస్తున్నట్టు సమాధానం ఇచ్చి తవ్వకాలను కొనసాగించారు. ఇందుకు స్థానికులు, వీఏఓ అడ్డు చెప్పడంతో విషయం కలెక్టర్‌కు చేరింది. దీంతో కలెక్టర్ ప్రతాప్ నేరుగా వీఏఓను ఫోన్‌లో పిలిచి తాను ఆదేశాలు ఇస్తే ఎలా అడ్డుకుంటారు. వీఏఓగా అక్కడ ఎలా పని చేస్తారో చూస్తానంటూ హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీఏఓ విశ్వనాథన్‌ను స్థానిక బాధ్యతల నుంచి తప్పించి వెయిటింగ్ లిస్టుకు పంపుతూ ఆర్డీవో రవిచంద్రన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన వీఏఓ విశ్వనాథన్, తమిళనాడు గ్రామ నిర్వాహణ అధికారుల సంఘం ప్రతినిధులతో కలిసి మంగళవారం ఉదయం తాహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని కోరారు. అయితే తాహశీల్దార్ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వీఏఓలు తాహశీల్దార్ కార్యాలయంలోనే నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఆర్డీవో రవిచంద్రన్ వీఏఓలతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం విశ్వనాథన్‌ను అక్కడే విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో వీఏఓలు ఆందోళననూ విరమించారు. కాగా వీఏఓల ఆందోళనతో తాహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.