
గాయాలైనా షూటింగ్ పూర్తి చేశారు..!
తమిళసినిమా: సినిమాల చిత్రీకరణ థియేటర్ నుంచి చూసే వారికి వినోదంగా ఉంటాయి. అన్ని రంగాల్లో మాదిరిగా ఇక్కడా సాధక బాధలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే షూటింగ్‌లు ప్రాణాలతో చెలగాటమే. ఒక్కోసారి పెద్ద మూల్యమే చెల్లించే పరిస్థితే నెలకొంటుంది. అలా కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు మురుగా అశోక్. ఈయన ఇంతకుముందు మురుగా, పిడిచ్చిరుక్కు, కోళి కూవుదు, గ్యాంగ్స్ ఆఫ్ మెడ్రాస్, మాయతిరై ,ఆర్ యు ఓకే బేబీ వంటి పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా మురుగ అశోక్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వడ మంజువిరట్టు. అన్నగారు పిక్చర్స్ పతాకంపై ప్రళయ స్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ దర్శకత్వం బాధ్యతలను సంగిలి. సీసీఏ నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ, కుటుంబ అనుబంధాలు, వీరత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు వంటి అంచనాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. వీటిలో మంజువిరట్టు క్రీడ ప్రధానంగా ఉంటుందన్నారు. (మంజువిరట్టు అంటే ఎద్దుల పరుగుల పోటీలు అని అర్థం) ఈ చిత్ర షూటింగ్‌ను దిండుక్కల్, అంజుకుళి పట్టి ప్రెసెంట్ ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. కాగా చివరిగా నటుడు మురుగా అశోక్ పందెపు ఎద్దుతో నటించాల్సిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు అనూహ్యంగా ఎద్దు అతడిపై దాడి చేసింది. దీంతో ఎగిరి దూరంగా పడ్డ మురుగా అశోక్ పొట్టభాగంలో తీవ్ర గాయాలకు గురయ్యారని చెప్పారు. వెంటనే ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు చెప్పారు. దీంతో షూటింగును రద్దు చేద్దామని భావించామని, అయితే మురుగా అశోక్ మరుసటి రోజు ఉదయాన్నే షూటింగ్‌కు సిద్ధం అయ్యారని చెప్పారు. తాము వద్దని ఎంత వారించినా ఆయన నిర్మాత డబ్బు, కళా దర్శకులు బృందం వేసిన సెట్, పందెపుటెద్దుల సంరక్షకులు, జూనియర్ ఆర్టిస్టులు అంటూ మొత్తం చిత్ర యూనిట్ శ్రమ తన వల్ల వృథా కావడం ఇష్టం లేదంటూ షూటింగ్‌లో పాల్గొని పూర్తి చేసినట్లు చెప్పారు.