
విజయాలెందుకు సాధించడం లేదంటే..
వైరముత్తు, తంగర్‌బచ్చన్‌లతో పడమాండ మా వీర చిత్ర యూనిట్
తమిళసినిమా: నటుడు, నిర్మాత, దర్శకుడు వి గౌతమన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం పడైమాండ మావీరా. నటుడు సముద్రఖని, పూజిత పొన్నాడ, ఇళవరసు, బాహుబలి ప్రభాకర్, శరణ్య పొన్‌వన్నన్, ఆడుగళం నరేన్, మన్సూర్ అలీ ఖాన్, రెడిన్ కింగ్స్లీ మధుసూదన్ రావ్, విశాల్ గళ్ రవి, సాయి దీనా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి గోపి జగదీశ్వరన్ ఛాయాగ్రహణం, జీవీ.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, శ్యామ్ సీఎస్ నేపథ్య సంగీతాన్ని అందించారు. డీకే ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మల సరవణరాజ్ ,ఎస్ కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి వి గౌతమన్, ఈ. కురన్ ముదన్, యుయం.ఉమాదేవన్, కె భాస్కర్, కే.పరమేశ్వరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గీత రచయిత వైరముత్తు, దర్శకుడు తంగర్ బచ్చన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కథానాయకుడు బి. గౌతమన్ మాట్లాడుతూ తాను ఎదగాలన్న సదుద్దేశంతో ఈ చిత్ర నిర్మించిన నిర్మాత బృందానికి ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రం కోసం ఎంతగానో శ్రమించిన నటీనటులు, సాంకేతిక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తమిళ మట్టిలో పుట్టిన ఎవరు ఉన్నత జాతికి చెందినవారు కారు, ఎవరు దళిత జాతికి చెందిన వారు కాదని అందరూ ఒక తల్లి బిడ్డలే అని చెప్పే చిత్రం ఇది అని పేర్కొన్నారు. గీత రచయిత వైరముత్తు మాట్లాడుతూ దర్శకుడు, వీ.గౌతమన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. ఈరోజుల్లో ఏడాదికి 200 చిత్రాలు విడుదలవుతున్నా, అందులో పది చిత్రాలు మాత్రమే విజయానికి దగ్గరవుతున్నాయన్నారు. మన చిత్రాలు విజయం సాధించకపోవడానికి కారణం దర్శక నిర్మాతలు సమాజంలోని కథలను కాకుండా పాత చిత్రాలనే.. కొత్త చిత్రాలుగా చేయడమేనని వైరముత్తు పేర్కొన్నారు.